రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులు కుడి ఎడమల దగాకు గురవుతున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని నమ్మి బ్యాంకులకు రుణాలు కట్టనివారు ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు.
లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.అయితే విడతల వారీగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో తమ వంతు ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాతిక వేలు రుణం ఉన్నవారికి తొలి విడతలోను, 50 వేల వరకు ఉన్నవారికి రెండో విడతలోనూ మాఫీ చేశారు.ఈ ఏడాది 75 వేల వరకు ఉన్నవారికి, వచ్చే ఏడాది లక్ష వరకు ఉన్నవారికి మాఫీ అవుతుందని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు.
రాష్ట్రంలో మొత్తం 40 లక్షల 66 వేల మంది రైతులు రుణమాఫీ అర్హత సాధించారు.వీరిలో 25 వేల లోపు రుణం ఉన్నవారు 2.96 లక్షలు…50 వేల వరకు రుణం చెల్లించాల్సిన వారు 4.5 లక్షల మంది ఉన్నారు.ఇప్పటి వరకు వీరికి మాత్రమే కేవలం 3 వేల కోట్లు చెల్లించి బ్యాంకు రుణాల మాఫీ చేశారు.మొత్తం 17 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ప్రభుత్వం మాఫీ చేస్తుందని రైతులు మూడేళ్ళుగా ఎదురుచూస్తుంటే.వడ్డీ తడిసి మోపెడయింది.
మూడేళ్ళుగా వస్తున్న రైతుబంధు డబ్బులు, ధాన్యం అమ్మిన డబ్బును బ్యాంకులు రుణం కింద జమ వేసుకుంటున్నాయి.మాఫీ విషయంలో ప్రభుత్వం చేసిన మోసం తెలుసుకుని రైతులు లబో దిబోమంటున్నారు.
50 వేల నుంచి లక్ష లోపు రుణాలున్న 34 లక్షల మంది రైతులు మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.రుణం మాఫీ కాక, బ్యాంకులకు కట్టలేక లక్షలాది మంది రైతులు మొండి బకాయిదారులుగా మిగిలిపోతున్నారు.దీంతో వీరికి మళ్ళీ బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు.అప్పులకు వడ్డీలు పెరిగిపోయి, ఇంతకాలం తర్వాత మాఫీ చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది.లక్ష వరకు రుణ మాఫీ అని రైతులను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ 34 లక్షల మంది రైతుల్ని నట్టేట ముంచింది.