తెలంగాణలో అధికారం లోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.టిఆర్ఎస్ బిజెపి లకు ధీటుగా కాంగ్రెస్ ను తీర్చిదిద్దాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరి మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకపోయినా, రాహుల్ సభ ను మాత్రం విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు.కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమన్వయ కమిటీతో జిల్లాల వారీగా సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు.
భారీ ఎత్తున రాహుల్ సభకు జనసమీకరణ చేసే విషయంపైనా దృష్టి పెట్టారు.వరంగల్ లో ఈనెల ఆరో తేదీన జరగబోయే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రాహుల్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ సభలో అనేక కీలక అంశాలపై ప్రకటనలు చేయించాలని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిసైడ్ అయ్యారు.
ఈ సభలోనే ‘వరంగల్ డిక్లరేషన్ ‘ ను చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
దీంట్లో రైతు అంశాలను అజెండాగా తీసుకుని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే అంశాలను ఈ డిక్లరేషన్ లో పొందు పరచనున్నారు.రైతులకు మద్దతు ధర కల్పించడం, పంట పెట్టుబడి సాయం చేయడం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రకటించడం, పండించిన పంటలు ధాన్యానికి మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం , అలాగే ఆయా ప్రాంతాల్లో పండించే పంట ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఎన్నో డెకరేషన్ లో పొందుపరచబోతున్నారు.
అలాగే తెలంగాణలోని అసైన్డ్ భూముల వ్యవహారాన్ని ఈ డిక్లరేషన్ లో పొందుపరచబోతున్నారు.
ఈ మేరకు వరంగల్ డిక్లరేషన్ ను ప్రత్యేకంగా ఒక బృందం రూపొందిస్తోంది.వరంగల్ లో కాంగ్రెస్ డిక్లరేషన్ ను హైలెట్ చేసి ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.రాహుల్ సభలో ఈ డిక్లరేషన్ లోని అంశాలను ఆయనతోనే ప్రకటించి టిఆర్ఎస్, బీజేపీలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది.
అలాగే ఈ వరంగల్ సభలోనే తెలంగాణ వ్యాప్తంగా రైతు కుటుంబాలను రాహుల్ పరామర్శించేలా వారితో కలిసి భోజనం చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.మొత్తంగా రాహుల్ గాంధీ వరంగల్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసే విధంగా సీనియర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.