ఆర్టీసీని మూసివేయం, కార్మికులను కన్న బిడ్డల్లా కాపాడుకుంటాం అంటూ తరచూ చెబుతూ వస్తున్న ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేసేందుకు సమాయాత్తమవుతోంది.ఇప్పటికే సంస్థలో కార్మిక సంఘాలకు ఉనికి లేకుండా చేసిన యాజమాన్యం ఆ తర్వాత సీసీఎస్‌ను నిర్వీర్యం చేసింది.
తాజాగా కార్మికుల చివరి దశలో ఆర్థికంగా కొంత చేదోడు వాదోడుగా నిలుస్తున్న స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం ను రద్దు చేయాలని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదన నిర్ణయ రూపం దాలిస్తే సుమారు 26,900 మంది ఉద్యోగుల కుటుంబాలు నెల నెలా పెన్షన్ పొందడాన్ని కోల్పోతాయని ఆర్టీసీ వర్గాలు పేర్కొన్నాయి.ఎస్‌ఆర్‌బీఎ్‌సను తొలగిస్తే ఏటా సుమారు రూ.6.5 కోట్లకుపైగా నిధులు మిగిలే అవకాశం ఉందని ప్రతిపాదనల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న అధికారులతో పాటు వివిధ స్థాయిల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు నెలనెలా వారి వేతనాల నుంచి రూ.300ల చొప్పున యాజమాన్యం మినహాయించి ఎస్‌ఆర్‌బీఎస్ ఖాతాలో జమ చేస్తుంది.అలాగే 1999లో ఆర్టీసీ యజమాన్యం, నాటి గుర్తింపు పొందిన కార్మిక సంఘం ప్రతినిధులతో జరిగిన ఒప్పందం ప్రకారం ఏటా సుమారు రూ.6.5 కోట్ల నిధులు ఎస్‌ఆర్‌బీఎస్ ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది.ఈ మొత్తాన్ని లాభదాయక వడ్డీ ఇచ్చే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెలా పెన్షన్ కింద ఆర్టీసీ చెల్లిస్తోంది.ప్రస్తుతానికైతే రిటైర్ అయిన ఉద్యోగులకు చెందిన 26,900 కుటుంబాలు ప్రతినెల కనిష్టంగా రూ.150 నుంచి గరిష్టంగా రూ.3,200 వరకు పొందుతున్నారు.
ఇందుకు ఆర్టీసీ నెలకు రూ.2.15 కోట్లు వెచ్చిస్తోంది.అయితే పని చేస్తున్న ఉద్యోగులకే నెల నెలా సక్రమంగా వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నేపధ్యంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ అందించి ఆదుకోవలిసిన అవసరం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ చెల్లింపు పథకం లేకపోవడంతో 1989 సంవత్సరంలో అప్పటి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ పథకాన్ని రూపొందించి సంస్థను ఒప్పించి అమలులోకి తీసుకు వచ్చారు.ఈ పథకం ద్వారా ఇప్పటికి ఒక్క టీఎస్‌ఆర్‌టీసీలోనే దాదాపు 35 వేల ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులు నెలవారిగా పెన్షన్‌ను పొందుతున్నారు.
రిటైరైన ఉద్యోగి మరణిస్తే ఆయన సతీమణి బతికి ఉన్నంత కాలం పెన్షన్‌ను పొందే అవకాశం ఈ పథకంలో కల్పించారు.
సంస్థలో పని చేసిన ఒక్కో కార్మికుడి వేతనానికి అనుగుణంగా పెన్షన్‌ను చెల్లింపులు జరుపుతున్నారు.తాజాగా సంస్థ ఎండీ ఈ పథకాన్ని రద్దు చేయాలని నిర్ణయించి అంతర్గతంగా సర్క్యూలర్‌ను జారీ చేశారు.వాస్తవానికి మార్చి మాసం నుంచే ఈ పథకం నిలిపి వేయాలని నిర్ణయించినప్పటికీ సర్క్యూలర్ జారీ అయ్యేలోగానే ఉద్యోగుల పే స్లిప్‌లన్నీ ప్రింట్ పూర్తవడంతో మే మాసం చెల్లింపులలో ఎస్‌ఆర్‌బీఎస్ కటింగ్ లేకుండా వేతనం చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు వేతన సవరణ లేక, డీఏ చెల్లింపులు లేకున్నా కష్టపడి పని చేస్తున్నారు.వారి కష్టార్జితంతో జీవితాంతం కూడబెట్టుకుని జీవిత చరమాంకంలో ఉపయోగపడేందుకు వీలుగా కొంత మొత్తాన్ని పోగు చేసుకుని వాటి ద్వారా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తుంటే యాజమాన్యం దాన్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.