ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ అమెరికా సహా పశ్చిమ దేశాలు మాస్కోపై ఆంక్షల కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే.అయినప్పటికీ పుతిన్ వెనక్కి తగ్గలేదు.
పలుమార్లు ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టింది అగ్రరాజ్యం.కానీ దీనికి ఆశించిన స్థాయిలో మద్ధతు కూడగట్టలేకపోతోంది.
ప్రధానంగా ఈ విషయంపై భారత్ ఏమాత్రం స్పందించకపోవడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది.కానీ ఇండియాతో అవసరాల దృష్ట్యా పైకి నవ్వుతోంది.
అయితే అగ్రరాజ్యం మాత్రం రష్యాను కంట్రోల్ చేయడానికి అన్ని రకాల మార్గాల్లోనూ ప్రయత్నిస్తోంది.
అయితే అంతర్జాతీయ వాణిజ్యం, రష్యా సంబంధిత వజ్రాల విక్రయాలను నియంత్రించడంలో బైడెన్ పరిపాలనా యంత్రాంగం సహాయాన్ని అమెరికా చట్టసభ్యుల ద్వైపాక్షిక సమూహం కోరింది.
విదేశాంగ శాఖ కార్యదర్శి టోనీ బ్లింకెన్, ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్‌లకు రాసిన లేఖలో చట్టసభ సభ్యులు రష్యా వజ్రాల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.రష్యా డైమండ్ ఇండస్ట్రీపై యూఎస్ ట్రెజరీ శాఖ జారీ చేసిన ఆంక్షలు చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యాకు చెందిన అల్రోసా ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ మైనింగ్ కంపెనీ.గతేడాది 4.2 బిలియన్ల విలువైన అమ్మకాలను జరిపింది.రష్యా డైమండ్ మైనింగ్ సామర్ధ్యంలో 90 శాతం వాటా ఈ కంపెనీదే.
ఇది ప్రపంచంలో 28 శాతంతో సమానం.ఈ కంపెనీలో రష్యా ప్రభుత్వానికి మూడింట ఒక వంతు యాజమాన్యపు హక్కులు వున్నాయి.
అయితే దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో వుంది.

అల్రోసా సీఈవో ఇవనోవ్ పుతిన్ సన్నిహితులలో ఒకరైన సెర్గీ బోరిసోవిచ్ కుమారుడు.ఆయన గతంలో ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, డిప్యూటీ ప్రధాన మంత్రి, రష్యా రక్షణ మంత్రిగా పనిచేశారు.అలాగే భద్రతా మండలిలో రష్యా తరపున శాశ్వత సభ్యుడిగా వున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన ఫిబ్రవరి 24న పుతిన్ సర్కార్‌పై అమెరికా ఆంక్షలు విధించింది.అయితే ఇవి అల్రోసాపై రుణాలు, ఈక్వీటీ లావాదేవీలను మాత్రమే నిరోధించగలిగాయని చట్టసభ సభ్యులు రాసిన లేఖలో పేర్కొన్నారు.
క్రెమ్లిన్‌కు చేరే వాణిజ్యం, ఆదాయాలను ఈ ఆంక్షలను ఇంకా అడ్డుకోలేదని చెబుతున్నారు.
ఈ ఆంక్షలకు తగ్గట్టుగానే బైడెన్ పరిపాలనా యంత్రాంగం కూడా మార్చి 11న రష్యా నుంచి దిగుమతులు నిషేధాన్ని ప్రకటించింది.
ఇది పారిశ్రామికేతర వజ్రాలతో సహా రష్యా మూలాలున్న ఉత్పత్తులను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తుంది.అయితే ఆంక్షలు అమలు చేయడంలో పెద్ద లొసుగు వుందని నిపుణులు అంటున్నారు.ఇది భారత్ లేదా మరెక్కడైనా తయారైన వజ్రాలను అమెరికాకు దిగుమతి చేయడానికి అనుమతిస్తుందని చట్టసభ సభ్యులు గుర్తుచేస్తున్నారు.రష్యా కాకుండా మూడవ దేశంలో రూపాంతరం చెందిన వజ్రాలు లేదా మరేదైనా వస్తువులు అమెరికాలోకి అనుమతి పొందుతాయని వారు వాదిస్తున్నారు.
ఇటీవలి నివేదిక ప్రకారం.ప్రపంచంలోని వజ్రాల్లో 95 శాతం భారత్‌లో కట్ చేసి, పాలిష్ చేయబడుతున్నాయని డైమండ్ ఇండస్ట్రీ చెబుతోంది.దీని ప్రకారం వజ్రాలను అల్రోసా అనుబంధ సంస్థ మైనింగ్ చేసి.భారత్ లేదా మరో దేశంలో పాలిషింగ్, కటింగ్ చేయిస్తుంది.
అనంతరం దీనిపై ఎలాంటి నిషేధం లేకుండా అమెరికాకు విక్రయించి రష్యా ప్రభుత్వానికి మేలు చేకూర్చవచ్చని కాంగ్రెస్ సభ్యులు లేఖలో ప్రస్తావించారు.







