తెలంగాణ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ను కలవరానికి గురిచేస్తున్నాయి.పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు తెలంగాణలో బీజేపీ బాగా బలోపేతం అవ్వడం, ఎన్నికల్లో తమ కే సవాల్ విసిరే స్థాయిలో బలం పెంచుకోవడం, ప్రతి విషయంలోనూ టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా చేయడంలో సక్సెస్ అవుతుండటం ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి.మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య గ్రూపు తగాదాలు తీవ్రంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉండడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గతంలో వివిధ కారణాలతో పార్టీని వీడి, వివిధ పార్టీలో చేరిన బలమైన నాయకులను తిరిగి వెనక్కి రప్పించే పనిలో కేసీఆర్ ఉన్నారట.గతంలో పార్టీ టిక్కెట్లు దక్కక సరైన ప్రాధాన్యం లభించక ఇంకా వివిధ కారణాలతో చాలామంది నేతలు బిజెపి, కాంగ్రెస్ వంటి పార్టీలలో చేటిపోగా, మరికొంతమంది ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయారు.
ఇప్పుడు వారందరినీ గుర్తించి పార్టీలో చేర్చుకునే అంశంపై కెసిఆర్ దృష్టి సారించారు.దీనిలో భాగంగానే మాజీ ఎంపీ ప్రస్తుత బిజెపి నాయకుడు వివేక్ వెంకటస్వామి ని టిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
తెలంగాణలో బలమైన మీడియా చానల్ కు అధిపతిగా ఉన్న వివేక్ గతంలో టిఆర్ఎస్ లోనే ఉండేవారు .అయితే ఆ పార్టీ ఎంపీ టికెట్ తనకే వస్తుంది అని చివరి వరకు ఆయన ఎదురుచూసినా. కేసీఆర్ టికెట్ కేటాయించడంతో అసంతృప్తితో ఆయన బీజేపీలో చేరారు.
ఆ పార్టీలో చేరిన తరువాత ఆయనకు బీజేపీ అధిష్టానం మంచి ప్రాధాన్యం ఇవ్వడంతో బిజెపి బలోపేతానికి ఆయన తన వంతు కృషి చేశారు.తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం ఈ స్థాయిలో బలోపేతం కావడానికి వివేక్ కృషి ఎంతగానో ఉంది.టిఆర్ఎస్ ను వీడిన తర్వాత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించినా, వివేక్ చక్రం తిప్పి ఆయనను బీజేపీ లో చేర్చారట.
రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మక కావడంతోనే కేసీఆర్ ఇప్పుడు వివేక్ టీఆర్ఎస్ లోకి వస్తే రాజ్యసభ ఇచ్చేందుకు సిద్ధం అనే రాయబారాలు పంపుతున్నారు.వివేక్ ను చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో బలమైన మీడియా మద్దతు లభించడంతోపాటు , బీజేపీపై పట్టు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందనే ఆలోచనతోనే వివేక్ ను వెనక్కి రప్పించే విషయంపైన ఇప్పుడు కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారట.