మార్చి 8 అంతర్జాతీయ మహిళా పోరాట దినంగా పాటిద్దాం

సూర్యాపేట జిల్లా:మహిళల స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వానికై ఉద్యమిద్దామని,మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా పోరాట దినంగా పాటిద్దామని భారత జాతీయ మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన మహిళా లోకానికి పిలుపునిచ్చారు.మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని 37 వ వార్డ్ లో జరిగిన మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా సదస్సుకు ఆమె ముఖ్యాతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవమని,మహిళల స్వేచ్ఛ, సమానత్వం కోసం,సమాన పనికి సమాన వేతనం కోసం మహిళల హక్కుల కోసం సంఘటితంగా నినదించిన రోజని గుర్తు చేశారు.1910 లో కోపెన్హాగన్ లో జరిగిన అంతర్జాతీయ మహాసభలో పాల్గొన్న కమ్యూనిస్టు ఉద్యమ నాయకురాలు క్లారా జెట్కిన్ మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదించిందని, నాటి నుండి నేటి వరకు మార్చి 8ని పోరాట స్ఫూర్తితో నిర్వహించుకుంటున్నారని తెలిపారు.మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనకు పోరాటాలే శరణ్యమని అన్నారు.మహిళలపై వివక్షత,అణిచివేత,సామాజిక కట్టుబాట్ల పేరుతోటి హింసకు,అత్యాచారాలకు పాల్పడుతున్నారని,మద్యం,మాదకద్రవ్యాల మత్తులో పశువుల్లాగా మారి మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 March 8 Is International Women's Day-TeluguStop.com

మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయని ఆరోపించారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కట్టుబాట్ల పేరుతో మనువాదాన్ని ముందుకు తీసుకు రావడంతో మహిళలపై తీవ్ర హింస పెరిగిపోతున్నదన్నారు.

ఎలాంటి బట్టలు వేసుకోవాలి,ఏ విధంగా ఉండాలో మహిళలను కించపరిచే రకంగా మంత్రి స్థాయిలో ఉన్న వాళ్లు కూడా నీచంగా మాట్లాడుతున్నారని, వీరికి మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఏమీ ఒరగబెట్టిందని మహిళా ఉత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు.

మహిళా దినోత్సవం అంటే ఆడుకోవడం కాదని,బాధిత మహిళలకు అండగా నిలవాలని,టిఆర్ఎస్ నాయకుడు నిర్మల్ లో మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే,మహబూబాబాద్ లో గ్యాంగ్ రేపుకు గురైన యువతి ఆత్మహత్య చేసుకుంటే,కొత్తగూడెంలో రాఘవ ఆగడాలను బలైన కుటుంబాల ఘటనలలో స్పందించని ప్రభుత్వాలు ఇప్పుడు మహిళా దినోత్సవాలు అంటూ రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.వ్యాపార ప్రకటనల్లో మహిళలను విలాస వస్తువులుగా చిత్రీకరిస్తున్నారని,టీవీ సీరియల్ లో విలన్ గా చూపెడుతున్నారని,ఇలాంటి వాటిని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఏరులై పారుతున్న మద్యాన్ని నియంత్రించాలని,అశ్లీల వెబ్సైట్లను నిషేధించాలని, అర్హులైన మహిళలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,పెన్షన్లు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.నాలుగు సంవత్సరాల నుంచి పెన్షన్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని వీటిని గుర్తించి ప్రభుత్వాలు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలన్నారు.

అంతకు ముందు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనంతుల మల్లీశ్వరి సంఘం జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లిశ్వరి, ఉపాధ్యక్షురాళ్లు ఐలాపురం లక్ష్మి, రేమిడాల జయసుధ,సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎల్లంల యాదగిరి,సభ్యులు బుక్క సావిత్రమ్మ,చెరుకు మంగమ్మ,నరేంద్రుని లలిత,చెరుకు సుజాత, పాజూరు రేణుక,అనంతుల గౌరమ్మ,లక్ష్మమ్మ,గోగుల శోభ,భాగ్య,పేదిల వెంకటమ్మ,సట్టు అంజమ్మ,నీడం అమృత,ఖమ్మం నారాయణమ్మ,ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube