అమెరికాలో తెలుగు ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో మరణించారు.నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఇండియన్ అమెరికన్ దేవేందర్ రెడ్డి నల్లమాడ మంగళవారం న్యూజెర్సీలోని ఎడిసన్‌లో అనుమానాస్పద స్థితిలో నిర్జీవంగా కనిపించారు.
అయితే ఆయన ఎలా చనిపోయారో మాత్రం పోలీసులకు అంతుచిక్కడం లేదు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేవేందర్ రెడ్డి వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.టీఆర్ఎస్‌పై అభిమానంతో రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఆయన.అమెరికాలో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు.అంతేకాకుండా అమెరికాలో తెలంగాణ సొసైటీ ఏర్పాటులోనూ దేవేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
దేశం కానీ దేశంలో తెలుగు వారు ఏ ఆపదలో వున్నా సాయం చేసేవారు.ఈ నేపథ్యంలో ఆయన మరణం పట్ల అమెరికాలోని తెలుగు ఎన్ఆర్ఐలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.అయితే కారులో పేలుడు సంభవించడం వల్ల దేవేందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారని కొన్ని వాదనలు వినిపిస్తుండగా.అగ్ని ప్రమాదం వల్లే ఆయన చనిపోయారని మరికొందరు అంటున్నారు.
దేవేందర్ రెడ్డి కారులో విండ్ షీల్డ్ విరిగిపోవడంతో పాటు అద్ధాలు పగిలిపోయాయి.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కాగా, కొద్దిరోజుల క్రితం తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ ఒకరు ప్రమాదవశాత్తు న్యూజెర్సీలో రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందిన రాజమౌళి చిన్న కుమారుడు ప్రవీణ్ కుమార్ (37) భార్య నవతతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు.
ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే, వీరికి మూడేళ్ల బాబు కూడా వున్నాడు.ఈ నేపథ్యంలో డిసెంబర్ 22న ప్రవీణ్ కుమార్ న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్‌షిప్ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తూ రైలు కింద పడి చనిపోయాడు.
ప్రవీణ్ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.