సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాక రేపుతూనే ఉంది.ముఖ్యంగా ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అనుసరిస్తున్న వైఖరిపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
లక్ష్మీనారాయణ సిబిఐ లో ఉండగా జగన్ అక్రమాస్తుల కేసులో చురుగ్గా వ్యవహరించారు.అప్పట్లో ఆయన వ్యవహరించిన తీరుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగింది.
నీతి నిజాయితీకి మారుపేరుగా లక్ష్మీనారాయణ ను ప్రతీకగా చూపిస్తూ ఉండేవారు.ఇక ఆ తరువాత మహారాష్ట్ర క్యాడర్ జేడీ తిరిగి వెళ్ళిపోవడం ,తన ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది.
అయితే ఆయన ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు వేశారు.కానీ అంతలోనే ఏమైందో తెలియదు గానీ దానిని విరమించుకుని, ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీలో చేరారు.
గతేడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.అతి తక్కువ సమయంలోనే మంచి ఓటింగ్ సాధించడం, ఆయన పట్ల మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్థులు సానుకూలంగా ఉన్నారనే విషయం బాగా అర్థమైంది.
జనసేన కు ఈ మధ్యకాలంలోనే రాజీనామా చేశారు.ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగినా జేడీ నుంచి స్పందన కరువైంది.కానీ అదే పనిగా ఆయన సందర్భం ఉన్నా, లేకపోయినా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ను పొగుడుతూ వస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అనేక టీవీ ఛానల్ డిబేట్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు.
జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తున్నారని, మేనిఫెస్టో లో ఉన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.అలాగే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన తర్వాత కూడా, జగన్ ఓ సందర్భంలో తనకు విమానాశ్రయంలో ఎదురుపడ్డారని, ఒకరికొకరం నమస్కారం అంటే నమస్కారం అంటూ పలకరించుకున్నామని చెప్పారు.
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కేవలం ఒక ఉద్యోగిగా మాత్రమే తన డ్యూటీ చేశానని చెప్పారు.జనసేన కు రాజీనామా చేసిన అంశంపైనా మాట్లాడుతూ, తాను ఫుల్ టైం రాజకీయాలు చేయడానికి వచ్చానని, కానీ పవన్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేసే విధంగా కనిపించడం లేదని, అందుకే జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్పారు.ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరలేదని, ఇంకా ఆలోచనలో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు.అయితే జేడీ కొద్దిరోజులుగా వ్యవహరిస్తున్న తీరు, మీడియా ఛానల్ లో మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే వైసీపీకి దగ్గరవ్వాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
అయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకు మొహమాట పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.