ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ తాజాగా 18 రోజుల పాటు రాష్ట్రంలో మద్యం సరఫరా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 12 నుండి 29 వరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ మేరకు ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచి ఉంటే రాష్ట్రంలోని పార్టీలు పురుష ఓటర్లకు మద్యం సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలపై మద్యం ప్రభావం పడకుండా నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.ఎంపీటీసీ స్థానాలకు 21న ఎన్నికలు జరగనుండగా, మున్సిపల్ స్థానాలకు 23న, పంచాయతీ ఎన్నికలకు 27,29 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.9,639 ఎంపీటీసీ, 660 జెడ్పీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా పంచాయతీ ఎన్నికలకు మరో దశలో జరగనున్నాయి.టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి.2019 సార్వత్రిక ఎన్నికల తరువాత జరగనున్న ఎన్నికలు కావడంతో ఓటర్ల మెప్పు పొండడానికి అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి.