ఆస్ట్రేలియాకు(Australian) చెందిన మిచెల్ రింగ్, జెన్నిఫర్ కోలిన్(Michelle Ring, Jennifer Colin) దంపతులకు విమాన ప్రయాణంలో ఊహించని షాక్ తగిలింది.మెల్బోర్న్ నుంచి దోహా వెళ్లే ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో వారు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఇటలీలోని వెనిస్‌కు వెకేషన్ కోసం ఎంతో ఆత్రుతగా బయలుదేరిన వీరికి, ఆ విమాన ప్రయాణం మాత్రం ఒక భయంకరమైన పీడకలగా మారిపోయింది.
ప్రయాణం మొదలైన పది గంటల తర్వాత, వారి సీటు వరుసకు దగ్గరలోనే ఒక మహిళా ప్రయాణికురాలు బాత్రూమ్ నుంచి వస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
విమాన సిబ్బంది వెంటనే స్పందించి ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించారు, కానీ దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది.ఆమె బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెను అక్కడి నుంచి తరలించడం సాధ్యం కాలేదు.దీంతో ఆమె మృతదేహాన్ని మిచెల్ రింగ్ (Michelle Ring)కూర్చున్న సీటు పక్కనే ఖాళీగా ఉన్న సీటులో ఉంచారు.
“ఒక విమాన సిబ్బంది వచ్చి నన్ను సీటు మార్చుకోమని అడిగారు.కారణం తెలియకపోయినా నేను సరే అన్నాను,” అని మిచెల్ తెలిపారు.“ఆ తర్వాత, వారు చనిపోయిన మహిళను నా సీటులో పెట్టారు.” అని అన్నారు.సిబ్బంది మృతదేహాన్ని దుప్పటితో కప్పేశారు.
కానీ ఇతర సీట్లు ఖాళీగా ఉన్నా మిచెల్‌ను మాత్రం అక్కడి నుంచి వేరే చోటికి మార్చలేదు.అతని భార్య కోలిన్‌ను మాత్రం వేరే సీటుకు మార్చారు.ఆ పరిస్థితి చాలా భయానకంగా, దిగ్భ్రాంతి కలిగించేలా ఉందని జెన్నిఫర్(Jennifer) ఆవేదన వ్యక్తం చేసింది.“ఆమె మరణానికి ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించదని మాకు తెలుసు, కానీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి వారికి సరైన వ్యవస్థ ఉండాలి కదా,” అని జెన్నిఫర్ అన్నారు.

విమానం దోహాలో దిగిన వెంటనే వైద్య సిబ్బంది, పోలీసులు విమానంలోకి వచ్చారు.అధికారులు పరిస్థితిని చక్కదిద్దే వరకు ప్రయాణికులందరినీ సీట్లలోనే కూర్చోమని ఆదేశించారు.ఈ సంఘటనపై ఖతార్ ఎయిర్‌వేస్ విచారం వ్యక్తం చేసింది.ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.ప్రయాణికులను సంప్రదిస్తున్నామని తెలిపింది.అయితే ఖతార్ ఎయిర్‌వేస్ గానీ, వారి టిక్కెట్లు బుక్ చేసిన క్వాంటాస్ ఎయిర్‌వేస్ గానీ తమను ఇంతవరకు సంప్రదించలేదని, ఎలాంటి సహాయం అందించలేదని ఆ జంట వాపోయింది.

ఇలాంటి ఘటనలను నిర్వహించే బాధ్యత విమానాన్ని నడుపుతున్న ఎయిర్‌లైన్స్‌దేనని క్వాంటాస్ స్పష్టం చేసింది.ఈ కేసులో ఖతార్ ఎయిర్‌వేస్ ఆపరేటింగ్ ఎయిర్‌లైన్ అని తెలిపింది.ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల శ్రేయస్సును పరిరక్షించడానికి విమానయాన సంస్థలు స్పష్టమైన నియమావళిని ఏర్పాటు చేయాలని ఆ జంట కోరింది.







