ప్రస్తుత కాలంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల మంచి కోసం చెప్పినప్పటికీ ఆ విషయం అర్థం చేసుకోకుండా కొంత మంది పిల్లలు అవగాహన లేకుండా తీసుకునేటువంటి కఠిన నిర్ణయాల కారణంగా తల్లిదండ్రుల జీవితంలో తీవ్ర విషాదం నిండుతోంది.తాజాగా ఓ యువకుడు తన తల్లి పబ్జి గేమ్ ఆడవద్దని, చక్కగా పని చేసుకోమని చెప్పినందుకే ఓ యవకుడు ఏకంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లా పరిసర ప్రాంతంలో హమీద్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.కాగా ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై అధికంగా ఉన్నటువంటి ఓ మొబైల్ షాప్ లో సెల్ఫోన్ రిపేరింగ్ పని చేస్తున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో పని తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం ఇంటి వద్దనే ఉంటున్నాడు.ఈ క్రమంలో పబ్జీ గేమ్ ఆడడం వ్యసనంగా మార్చుకున్నాడు.
దీంతో ఈ మధ్యనే హమీద్ తల్లి పబ్జి గేమ్ ఆడడం మానేసి ఏదైనా పని చూసుకోమని ఇల్లు గడవడం కష్టంగా ఉందని కొంతమేర మందలించింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హమీద్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇందులో భాగంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది గమనించిన మృతుడి తల్లి వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అలాగే మృతుడి తల్లి తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.