టెస్లా సీఈవో, స్పేస్ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ ( Elon Musk )వివిధ రకాల చిక్కుల్లో పడటం కొత్తేం కాదు.తాజాగా ఆయన కాపీ కొట్టారనే వివాదంలో చిక్కుకున్నారు.2004లో విల్ స్మిత్ హీరోగా ‘ఐ, రోబోట్’( I, Robot ) అనే సైన్స్ ఫిక్షన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.హాలీవుడ్ దర్శకుడు అలెక్స్ ప్రోయస్ దీన్ని తీశాడు.
అయితే ఇప్పుడు ఆయన బిలియనీర్ ఎలాన్ మస్క్ తన సినిమాలోని రోబో డిజైన్లను కాపీ కొట్టాడని ఆరోపించారు.మస్క్ తాజాగా ప్రదర్శించిన తన కొత్త రోబోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తన సినిమాలో చూపించిన టెక్నాలజీని చాలా పోలి ఉన్నాయని ప్రోయస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అలెక్స్ తన పోస్ట్‌లో ‘ఐ, రోబోట్’ సినిమా నుంచి కొన్ని ఫొటోలు, మస్క్ ఆప్టిమస్ రోబో, సైబర్కాబ్, ‘రోబోవాన్’ల ఫోటోలను పక్కపక్కనే పెట్టి చూపించారు.“హే ఎలాన్, నా డిజైన్లను నాకు తిరిగి ఇవ్వగలరా?” అని కూడా అలెక్స్ అడిగారు.
అలెక్స్ తన ఇన్స్టాగ్రామ్ రిప్లైలో తన సినిమాకి అంత అద్భుతమైన డిజైన్లు చేసిన తన డిజైన్ టీమ్‌ని ప్రశంసించారు.ఆ తర్మవాత మస్క్ టీమ్ గురించి వ్యాఖ్యానిస్తూ, “ఎలాన్ మస్క్‌కి టాలెంట్ లేని డిజైన్ టీమ్ ఉంది.వారి సినిమాలు చూసి ఈ డిజైన్లు చేస్తున్నారు.అందులో ‘ఐ, రోబోట్’ కూడా ఉందేమో” అని హాస్యంగా అన్నారు.ఈ విషయంపై సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన పాట్రిక్ తాటోపౌలోస్ కూడా స్పందిస్తూ, “నాకేమో కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది ఎలాన్ నా ‘ఐ, రోబోట్’ డిజైన్ల నుంచి ప్రేరణ తీసుకున్నాడేమో.ఏదేమైనా చూడటానికి చాలా ఫన్‌గా ఉంది” అని రాశారు.
అలెక్స్ దర్శకుడిగా తెరకెక్కించిన ‘ఐ, రోబోట్’ సినిమా ఇసాక్ అసిమోవ్ రచించిన నవల ఆధారంగా తీయడం జరిగింది.ఈ సినిమాలో మనం ఇప్పుడు చూస్తున్న ఎలాన్ మస్క్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోల మాదిరిగానే కనిపించే కార్లు, రోబోట్లను చూడవచ్చు.ఈ సినిమాలో విల్ స్మిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తారు.ఆయన రోబోలను అస్సలు నమ్మడు.భవిష్యత్తులోని చికాగో నగరంలో జరిగే ఈ కథలో, ఒక రోబోటిక్ నిపుణుడు అనుమానాస్పదంగా మరణించడంతో, అతను దానిని దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు.దర్యాప్తు చేస్తున్న క్రమంలో రోబోలకు సంబంధించిన ఒక పెద్ద కుట్రను బయటపెడతాడు.