ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటూ ఉంటాయి.ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పై ఈసారి బడాబడా నాయకులు కన్నేశారు .
పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అలాగే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు సైతం రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.
ఇక ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు .ఆయన ఏ పార్టీలో చేరినా, పాలేరు లేదా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.ఈ విధంగా కీలక నాయకులంతా పాలేరు నియోజకవర్గం పై ఆశలు పెట్టుకోవడంతో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా కాబోతోంది.

ఇది ఇలా ఉంటే.తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ ఉన్నవాళ్లు ఈ ప్రాంత బిడ్డలు, మనకు పరాయి నాయకులు కావాలంటూ లోకల్ సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.
ముఖ్యంగా వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ఉద్దేశించి ఉపేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమా ? ఇతర ప్రాంతాల నాయకులు రావాలా అంటూ లోకల్ సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం మొదలుపెట్టారు.మట్టికైనా మనోళ్లు కావాలంటారు.అటువంటిది మనకు పరాయి నాయకులు వచ్చి ఏం చేస్తారు ? వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.కూసుమంచి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన ఆశయమని, ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా డబ్బు ఉంది కానీ , మన ప్రాంతం ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యమని , అందుకే వేరే ప్రాంతాల వాళ్ళ మాయమాటలు పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన అన్నారు.కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఉపేందర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు.అయితే ఇదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కూడా ఈ నియోజకవర్గంలో పైన ఆశలు పెట్టుకోగా, షర్మిల కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో కందాల ముందుగానే లోకల్ సెంటిమెంటును రాజేసే ప్రయత్నం మొదలుపెట్టినట్లుగా కనిపిస్తున్నారు.