వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దేశం కానీ దేశంలో స్థిరపడినా మాతృభూమిపై మమకారాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు ప్రవాస భారతీయులు.అక్కడ తాము సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని జన్మభూమి కోసం ఖర్చుపెట్టేవారు ఎంతో మంది వున్నారు.
అంతేకాకుండా గ్రామాలను దత్తత తీసుకోవడం, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, రోడ్లు, మంచినీటి వసతి కల్పించడం వంటి పనులను ఎన్ఆర్ఐలు నిర్వర్తిస్తున్నారు.అలాగే మనదేశంలో పారిశ్రామిక ప్రగతికి కూడా ప్రవాస భారతీయులు తమ వంతు సాయం చేస్తున్నారు.
అలాగే తమకు ఆశ్రయం ఇచ్చిన దేశంలోనూ అభాగ్యులకు చేయూతనిచ్చే సంస్థలు ఎన్నో వున్నాయి.ఈ క్రమంలో ఇండో అమెరికన్ ఎన్జీవో సంస్థ ‘‘సేవా ఇంటర్నేషనల్’’ అరుదైన ఘనతను సాధించింది.2021వ సంవత్సరానికి గాను స్వచ్ఛంద సంస్థల జాబితాలో 10వ స్థానానికి ఎగబాకింది.
కోవిడ్ మహమ్మారి ఉవ్వెత్తున ఎగసిపడిన గతేడాది భారత్, అమెరికా ఇరుదేశాల్లోనూ సేవా ఇంటర్నేషనల్ బాధితులను ఆదుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
గ్లోబల్ కార్పోరేట్ పర్పస్ సాఫ్ట్‌వేర్‌ను అందించే బెనివిటీ జాబితాలో 2019లో 690, 2020లో 375వ ర్యాంకులో వున్న సేవా ఇంటర్నేషనల్ మరుసటి ఏడాదికే టాప్ 10లోకి దూసుకురావడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం.బాధితులకు సాయం అందించాలన్న నిబద్ధత, వాలంటీర్లు, నిర్వాహకుల కృషి కారణంగానే ఈ సంస్థకు ఈ ఘనత దక్కింది.2021లో 700 కంపెనీల నుంచి దాదాపు 1.6 మిలియన్ల మంది ప్రజలు బెనివిటీ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల ఎన్జీవో సంస్థలకు 2.3 బిలియన్ డాలర్లను విరాళంగా అందజేశారు.భారత్‌లోని కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో యూనిసెఫ్‌కు సైతం గతేదాడి అదనపు విరాళాలు అందాయని బెనివిటీ తెలిపింది.
గతేడాది డెల్టా వేరియంట్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రిటన్, జర్మనీ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, చైనా తదితర దేశాలతో పాటు కార్పోరేట్ దిగ్గజాలు వీలైనంత సాయం చేశారు.ప్రధానంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, పీపీఈ కిట్లు, వైద్య సామాగ్రిని అందజేశారు.SEWAఇంటర్నేషనల్ విషయానికి వస్తే.భారత్‌లోని ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించేందుకు గాను Help India Defeat COVID-19‘ప్రచారాన్ని ప్రారంభించింది.వీటితో పాటు భారత్‌లోని 10,000 కుటుంబాలకు, 1,000కి పైగా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం, మందులను అందించింది.