ఏపీ లో 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీచినా, ఆ గాలిని తట్టుకుంటూ రెండోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా నందమూరి బాలయ్య గెలుపొందారు.కానీ గెలిచిన దగ్గర నుంచి బాలయ్య సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.
అసెంబ్లీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూ, టీడీపీ ని హేళన చేస్తున్నా బాలయ్య మాత్రం మౌనంగానే ఉంటున్నారు.ఇక తన బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ పైన వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు నిత్యం చేస్తూనే ఉన్నారు.
మంత్రి కొడాలి నాని వంటి వారు అయితే అసభ్య పదజాలంతో నిత్యం చంద్రబాబు, లోకేష్ ఇద్దరినీ తిట్టు పోస్తూనే వస్తున్నారు.అయినా వారి విషయంలో చంద్రబాబు కానీ, లోకేష్ గాని పెదవి విప్పడం లేదు.
సరిగ్గా ఈ విమర్శల వ్యవహారం జోరందుకున్న సమయంలోనే ఆకస్మాత్తుగా బాలయ్య ఎంట్రీ ఇచ్చారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా వైసీపీ మంత్రి , తన సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని పై విమర్శలతో కూడిన హెచ్చరికలు చేశారు.
అంతే కాదు ఇకపై తమ జోలికి వస్తే తడాఖా చూపిస్తానంటూ గట్టిగానే వ్యాఖ్యానించారు.దీంతో ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యల వెనుక ఉన్న సంగతి ఏంటి అనే విషయం పైన చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం వ్యవహారం చూస్తుంటే, రానున్న రోజుల్లో టీడీపీ తరఫున ఆయన గట్టిగానే వాయిస్ పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.టిడిపిలో చంద్రబాబు లోకేష్ మాత్రమే కాదని, తాను ఆ స్థాయి వ్యక్తిని అని నిరూపించుకునేందుకు బాలయ్య ఇప్పుడు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

ఇదే స్పీడ్ ముందు ముందు కొనసాగించి రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ సొంత ఇమేజ్ ను పార్టీలో క్రియేట్ చేసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం లోకేష్ పార్టీలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.లోకేష్ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజలలోనూ అనేక అనుమానాలు ఉండడం, అలాగే బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ ని ఢీ కొట్టేందుకు లోకేష్ కు శక్తి సామర్థ్యాలు సరిపోవనే అభిప్రాయం సొంత పార్టీ నేతలలోనూ ఉండడంతో , బాలయ్య తన శక్తి సామర్థ్యాలను చూపించుకుంటూ లోకేష్ కాకపోతే తానే టీడీపీకి ఆశాకిరణం అనే సంకేతాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం హిందూపురం పర్యటనలో ఉన్న బాలయ్య రానున్న రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాలోనూ పర్యటించేందుకు, వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసేందుకు రంగంలోకి దూకబోతున్నారు అనే హడావుడి ప్రస్తుతం టీడీపీపిలో నెలకొంది.