టిడిపి అదినేత చంద్రబాబుకు ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మధ్య రాజకీయ వైరం ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో వీరి మధ్య రాజకీయ వైరం ఉంది.
ఇరు కుటుంబాలు ఒకరికొకరు దూరంగానే ఉంటూ వచ్చారు.టిడిపి నుంచి బయటకు వచ్చిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా కాలం సైలెంట్ గానే ఉండిపోయారు .తరువాత కాంగ్రెస్ లో చేరడం, ఆ తర్వాత వైసిపిలోకి వెళ్లడం వంటివి జరిగాయి ప్రస్తుతం ఆయన వైసీపీకి దూరంగానే ఉంటున్నారు.2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసినా , ఓటమి చెందడం ఆ తర్వాత జగన్ తో విభేదాలు పెరగడం వంటి కారణాలతో ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు.
ఇటీవల నందమూరి కుటుంబంలో జరిగిన శుభకార్యాలలోనూ చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక అంశాలపై మాట్లాడడం తదితర పరిణామాలు తర్వాత వెంకటేశ్వరరావు టిడిపికి దగ్గరవుతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య ఎన్టీఆర్ కుమార్తె అయిన పురందరేశ్వరి బిజెపిలో కీలకంగా ఉండడంతో, ఆయన టిడిపిలోకి వెళ్లే అవకాశం లేదనే ప్రచారం జరిగింది.
అయితే వీరి కుమారుడు దగ్గుపాటి హితేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలో టిడిపిలో చేరేందుకు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేశ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
దగ్గుపాటి తన కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుకు దగ్గరవుతున్నారని , హితేష్ కు టిడిపి తరఫున చీరాల టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇటీవలే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించడంతో పర్చూరు లో ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరు సాంబశివరావుకు మరోసారి సీటు కన్ఫర్మ్ అయింది.ఈ క్రమంలోనే చీరాల నుంచి హితేష్ ను పోటీకి దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది .అక్కడ వైసిపి తరఫున ఆమంచి కృష్ణమోహన్ , కరణం బలరాం వంటి వారు పోటీ చేసేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు సీటు కనుక ఇస్తే, అక్కడ బలమైన అభ్యర్థిగా హితేష్ ను దించితే ప్రయోజనం ఉంటుందని బాబు భావిస్తున్నారట.దీనికి తోడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబానికి చీరాలలోనూ బంధు వర్గం, అనుచరులు ఉండడంతో ఈ సీటు ను హితేశ్ కు ఇచ్చినా గెలుచుకునే అవకాశం ఉన్నట్లు బాబు అంచనా వేస్తున్నారట.
ఈ క్రమంలోనే త్వరలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ టిడిపిలో చేరే అవకాశం కనిపిస్తోంది.