ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.
ఇది ఈనాటిది కాదు.దశాబ్ధాల క్రితమే దీనికి బీజాలు పడ్డాయి.
అక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది నిరుపేదలే.దేశం కానీ దేశంలో పస్తులుండి, యజమాని చేతిలో చిత్రహింసలు అనుభవిస్తూ కుటుంబానికి డబ్బు పంపేవారు లక్షల్లో వున్నారు.
ఇక అసలు మేటర్‌లోకి వెళితే.ప్రమాదవశాత్తూ బొటనవేలుకి గాయం కావడంతో ఒక భారతీయ వడ్రంగి దుబాయ్‌లో చికిత్స చేయించుకునే స్తోమత లేక ఢిల్లీకి వచ్చాడు.
ఘటన జరిగిన 22 గంటల తర్వాత బొటనవేలుకి కట్టుతో ఢిల్లీలో దిగాడు.మరో రెండు గంటలు ఆలస్యం చేసి వుంటే గనుక ఆయన కోలుకునే అవకాశాలు దాదాపు వుండేవి కావని వైద్యులు అంటున్నారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సందీప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో.సామెల్ మెషీన్‌లో పనిచేస్తుండగా ఎడమ బొటనవేలు తెగిపోయింది.ఆయనకు వచ్చే కొద్దిపాటి ఆదాయం దుబాయ్‌లో చికిత్స చేయించుకోవడానికి ఏ మాత్రం సరిపోదు.దీంతో అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి బొటన వేలిని వేళ్ల మధ్య వుంచి కట్టు కట్టి ఇంటికి పంపారు.
దుబాయ్ నుంచి భారత్‌కు రాగానే కుటుంబసభ్యులు సందీప్‌ను ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.మెషీన్‌లో వుండే రంపం మూడు రక్త నాళాలను కత్తిరించడంతో 24 గంటల్లోనే 300 మిల్లీల రక్తం పోయిందని వైద్యులు తెలిపారు.
ఆసుపత్రిలో చేరిన 10 నిమిషాల్లోనే సందీప్‌ను సర్జరీకి తీసుకెళ్లామని సాంకేతికంగా దీనినే ‘‘రీ ఇంప్లాంటేషన్’’ అని పిలుస్తామని డాక్టర్ ఆశిష్ చౌదరి తెలిపారు.ఇది పూర్తి కావడానికి దాదాపు 6 గంటల సమయం పట్టిందని .ఈ ప్రత్యేకమైన ప్రక్రియ కోసం మైక్రో స్టిచ్చింగ్, మైక్రో సాధనాలను ఉపయోగించామని ఆశిష్ వెల్లడించారు.బొటనవేలును తెగిపోయిన ధమనుల మధ్య ఉంచడానికి వైద్యులు బాధితుడి ముంజేతి సిరలోని కొంత భాగాన్ని సేకరించారు.
ప్రస్తుతం సందీప్ కోలుకున్నాడని.మరో పది పదిహేను రోజుల్లో విధుల్లో చేరడానికి సిద్ధంగా వున్నాడని ఆశిష్ చౌదరి చెప్పారు.
ఒక కోల్డ్ బాక్స్‌లో లేదా మంచుతో చుట్టబడి వుంటేనే 24 గంటల లోపు తెగిపోయిన బొటనవేలుని విజయవంతంగా తిరిగి అమర్చవచ్చని.అందువల్ల దీనిని అరుదైన శస్త్రచికిత్సగా పేర్కొంటున్నారు వైద్యులు.