గులాబీ మొక్కకు ముళ్ళు ఉన్నాగాని ఆ మొక్కకి పూచే గులాబీ పూలు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం.గులాబీ పూలు చూడడానికి చాలా అందంగా ఉండడంతో పాటు రకరకాల రంగులలో మనకు లభ్యం అవుతాయి.
కేవలం గులాబీ మొక్కలను పూల తోటలలో మాత్రమే కాకుండా మన ఇంటి పెరటిలో కూడా పెంచుకుంటూ ఉంటాము.కొంతమంది కుండీల్లో కూడా ఈ గులాబీ మొక్కలను పెంచుతారు.
మనం ఎంతో ఇష్టపడి పెంచిన గులాబీ మొక్కకు ఒక అందమైన పువ్వు పూస్తే దానిని చూసి మనసు పులకరించిపోతుంది కదా.కానీ కొన్ని మొక్కలు మాత్రం సరిగా పూలు పూయవు.వాటిని చూసి మన మనసు చలించి పోతుంది కదా అందుకనే ఈరోజు గులాబీ మొక్కకు ఎటువంటి పోషణ అందిస్తే పూలు ఎక్కువగా పూస్తాయో అనే విషయాలు తెలుసుకుందాం.
గులాబీ చెట్లు పెంచాలని అనుకునేవారు చిన్న చిన్న కుండీల్లో వాటిని పెంచితే పోషణ సరిగ్గా అందదు.
అందువలన గులాబీ మొక్కలను పెంచేందుకు పన్నెండు నుండి 18 అంగుళాల కుండీలను మాత్రమే ఎంచుకోవాలి.ఆ కుండీలలో సారవంతమైన మట్టిని వేయాలి.అలాగే ఆ మట్టితో పాటు పశువుల ఎరువు లేదంటే వర్మికంపోస్ట్ ను ఒకవంతు చొప్పున మట్టిలో కలుపుకోవాలి.ఎప్పటికప్పుడు కుండీలలో సరిపడా నీరు పోస్తూ ఉండాలి.
ఎక్కువ నీరు పోసి కుండీలో నీరు నిల్వ ఉంచకూడదు.

ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గులాబీ మొక్కకు ప్రతి రోజు కనీసం మూడు గంటలపాటు ఎండ తగిలేలా పెట్టాలి.అలాగే కాండం ఎక్కువగా పెరిగితే కాండపు చివర్లను కత్తిరించుకోవాలి.కత్తిరించిన చోట బోరాడాక్స్ మిశ్రమాన్ని వేయాలి.
అలాగే మన ఇంట్లోనే గులాబీ మొక్కకు కావలిసిన ఎరువు లభిస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు.మనం వంట గదిలో నిత్యం ఉపయోగించే ఉల్లిపొట్టు, బంగాళదుంప పొట్టు, టీ పొడి, కాఫీ పొడి,గుడ్డు పెంకులు ఇవన్నీ కూడా గులాబీ మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయి.
గులాబీ మొక్కకు పండిన, ఎండిన ఆకులు, కొమ్మలు తుంచేయాలి అప్పుడే కొత్త చిగురు చిగురిస్తుంది.పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ప్రతి రోజు గులాబీ పూలు పూస్తూనే ఉంటాయి.