ఏపీలో బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు వీల్లేదంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పై విపక్షాలు పెద్ద ఎత్తున పోరాటానికి దిగాయి. టిడిపి , జనసేన తో పాటు బీజేపీ ఈ విషయంలో రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మిగతా అన్ని పార్టీల కంటే , బిజెపినే ఎక్కువగా ఈ అంశం పై ఫోకస్ పెట్టి పోరాటాలను చేపడుతూ, ప్రజలను కలుపుకుని వెళుతూ, ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పడమే కాకుండా ఈ విషయంపై గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు.మిగతా పండుగ విషయంలో లేని అభ్యంత్రాలు వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే ఎందుకు అంటూ ఏపీ బీజేపీ నేతలు వైసిపి ప్రభుత్వం ను ప్రశ్నిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ హిందూ వ్యతిరేకి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఏపీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తుండటంతో వైసిపి నాయకులు దీనికి గట్టిగానే కౌంటర్ లు ఇస్తున్నారు.
వాస్తవంగా చూసుకుంటే కొద్దిరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.దేశం లో కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గలేదని, పండుగలు, ఉత్సవాల పేరుతో జనం రోడ్లపైకి వస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ కేంద్రం ఆగస్టు 28 వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే వినాయక మండపాలు ఏర్పాటు చేయడం, నిమజ్జనం పేరుతో ఊరేగింపులు ఇవన్నీ నిషేధం లోకి వస్తాయి.ఆ మార్గదర్శకాల ప్రకారం ఏపీ ప్రభుత్వం దీనిపై ఆదేశాలు జారీ చేసింది.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే విధమైన ఆంక్షలు అమలు అవుతున్నాయి.అయితే దీనిపైన ఏపీ బీజేపీ నేతలు పోరాటం చేస్తుండటంతో, ప్రజలలోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
కేంద్రం లో ఒకలా రాష్ట్రంలో ఒకలా బీజేపీ నాయకుల వ్యవహార శైలి ఉందని, కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు అనే ప్రశ్న తలెత్తుతోంది.

అయితే ప్రస్తుతం జగన్ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.కాకపోతే ఈ ఉత్సవాల పై జగన్ పూర్తిగా నిషేధం విధించకుండా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని షరతుల విధించి ఉంటే ఏపీ ప్రభుత్వం అభాసుపాలు అయి ఉండేది కాదని, అలా చేయకపోవడం వల్లే జగన్ ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ఏపీ బీజేపీ నేతలు మౌనంగా ఉండడమే కాకుండా, దీని పై ఏపీ ప్రభుత్వం పైనే వారు విమర్శలు చేస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురవగా, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా బీజేపీ నేతలు కేంద్రం నిర్ణయంపై పోరాడాలని , వారిని ప్రశ్నించాలి అంటూ బీజేపీ నేతలకు చురకలు అంటించారు.కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మాత్రమే మేము నడుచుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
కానీ మహారాష్ట్ర బీజేపీ నేతలు , ఏపీ బీజేపీ నేతలు దానిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది.