ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను మొత్తం 55 మంది అభ్యర్థులను ప్రకటించింది.ఒక కుటుంబానికి ఒకటే టికెట్ నినాదం వినిపించిన కాంగ్రెస్ ఉదయ్ పూర్ తీర్మానం మేరకు గతంలో ఒక కుటుంబానికి ఒకే టికెట్ తీర్మానం చేసింది .
తమతో పాటు, తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలామంది నుంచి విజ్ఞప్తులు వచ్చినా, అవేమి పట్టించుకోలేదు. కాకపోతే రెండు కుటుంబాలకు మాత్రం ఉదయపూర్ తీర్మానం నుంచి మినహాయింపు ఇచ్చింది.
అయితే ఈ విషయంలో మిగతా వారి నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా, ముందుగానే దానికి కారణాలను వివరించింది.
ఉదయ్ పూర్ తీర్మానం లో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని కాంగ్రెస్ తీర్మానించింది.
కానీ కొన్ని సమయాల్లో ప్రత్యేక మినహాయింపులు ఉంటాయని కాంగ్రెస్ ప్రకటించినా, తొలి అభ్యర్థుల జాబితాను చూస్తే అర్థమవుతుంది.కేవలం గెలుపు అవకాశం ను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
మాజీ పిసిసి అధ్యక్షుడు నల్గొండ జిల్లా కీలక నేత , ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) కుటుంబానికి రెండు సీట్లను కేటాయించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్ టికెట్ కేటాయించగా , ఆయన సతీమణి పద్మావతికి( Padmavati ) కోదాడ సీటు ను ఖరారు చేశారు.
గత ఎన్నికల్లో నూ హుజూర్ నగర్ నుంచే పోటీ చేశారు .2018 ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతి ఓటమి చెందగా, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.కాకపోతే లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ స్థానాన్ని కోల్పోయింది.
ఈసారి మళ్లీ రెండు సీట్లను ఈ కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది.
అలాగే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కు( Mainampally Hanumantha Rao ) మల్కాజ్ గిరి స్థానాన్ని కేటాయించగా , ఆయన కుమారుడు రోహిత్ రావుకు( Rohith Rao ) మెదక్ అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించారు.బీఆర్ఎస్ లో మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ దక్కినా, తన కుమారుడు టికెట్ ఇవ్వకపోవడంపై అలక చెంది కాంగ్రెస్ లో రెండు టిక్కెట్ల హామీపై చేరారు. అనుకున్నట్లుగానే ఆయనకు ఆయన కుమారుడికి రెండు స్థానాలను కాంగ్రెస్ కేటాయించింది.