దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటైందని తెలుస్తోంది.ఈ నెలలో ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన వచ్చిన తరువాతి రోజే జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు అంటూ వార్తలు రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే దేశ వ్యాప్తంగా లోక్ సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే యోచనలో ఉన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా జమిలి ఎన్నికల కోసం బలంగానే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.దీన్ని అమల్లోకి తెచ్చే విధంగానే ప్రస్తుతం కార్యాచరణ మొదలుపెట్టిందని సమాచారం.