టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ 2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ సీటుతో మంత్రి పదవిని అనుభవించారు.2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో పోటీ చేశారు.అమరావతి రాజధాని అంశం తమకు కలిసొస్తుందని చంద్రబాబు భావించి లోకేష్‌కు ఆ సీటు కట్టబెట్టారు.కానీ లోకేష్ ఓటమి పాలయ్యారు.వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓడిపోయారు.తాను ఓడిపోయినా లోకేష్ మంగళగిరిని వదలిపెట్టడం లేదు.
పట్టువదలని విక్రమార్కుడిలా పోయిన చోటే వెతుక్కోవాలని లోకేష్ ఆరాటపడుతున్నారు.దీంతో మంగళగిరిలో నిత్యం పర్యటిస్తూ ప్రజాసమస్యలను తెలుసుకుంటున్నారు.తాజాగా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇటీవల లోకేష్ మంగళగిరిలో పర్యటించారు.ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
వైసీపీ-టీడీపీ పాలనలో నిత్యావసరాల ధరలు ఏవిధంగా ఉండేవో తెలిపేలా కరపత్రాలు పంపిణీ చేశారు.
జగన్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో లోకేష్ వివరించారు.
టీడీపీ హయాంలో పింఛన్ పెంచి ప్రజలను ఎలా ఆదుకుందో తెలిపారు.పేద, మధ్య తరగతి కుటుంబాలకు టీడీపీ పాలనలో 4వేల రూపాయలు మిగులు ఉంటే వైసీపీ పాలనలో 9వేల రూపాయల లోటు ఉంటోందని లోకేష్ ఆరోపించారు.
అటు నిత్యావసర ధరలు, చెత్త పన్ను, ఇంటి పన్నులతో ఈ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే క్రమంగా మంగళగిరిలో పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.గత ఎన్నికలతో పోలిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గ్రాఫ్ పెరిగినట్లు కనిపిస్తోంది.స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో మంగళగిరి వెళ్లినప్పుడల్లా లోకేష్‌కు మహిళలు అడుగడుగునా స్వాగతాలు, నీరాజనాలు పలుకుతున్నారు.నియోజకవర్గంలో మార్పునకు ఇదే సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.