సినీ నటుడు అలీకి ఏపీ ప్రభుత్వంలో పదవి దక్కిన సంగతి తెలిసిందే.ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆయనను ముఖ్యమంత్రి జగన్ నియమించారు.
ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముత్యాలరాజు జారీ చేశారు.ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరే ఆయనకు కూడా జీతభత్యాలు అందనున్నాయి.మరోవైపు తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడంపై అలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ… వైసీపీలో చేరిన తొలిరోజు నుంచే తాను పార్టీ కోసం పని చేస్తున్నానని చెప్పారు.పార్టీలో పదవులను తాను ఏనాడూ ఆశించలేదని అన్నారు.
ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడంతో పాటు, పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని… తన సేవలను జగన్ గుర్తించారని చెప్పారు.తనకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు.
ఈ పదవిని తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెప్పారు.