మన శరీరానికి అవసరం అయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి.కండరాల అభివృద్ధికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ,ఎముకల ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం.
అలాగే ప్రోటీన్ బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రోటీన్ వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.అయితే ఈ క్రమంలోనే కొందరు ప్రోటీన్ ను అధికంగా తీసుకుంటూ ఉంటారు.
అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ ను శరీరానికి అందించడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
అధికంగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల తలెత్తే ప్రమాదకర సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది.అధిక ప్రోటీన్ కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది.
వాటి పనితీరు నెమ్మదించేలా చేస్తుంది.క్రమంగా ఇది కిడ్నీలు దెబ్బ తినడానికి దారి తీస్తుంది.
అలాగే అతిగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను తరచూ ఎదుర్కోవాల్సి వస్తుంది.
శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ అందించడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు.అధిక ప్రోటీన్ ఆహారాలు మూత్రం ద్వారా నీటి నష్టాన్ని పెంచుతాయి.
అందు కారణంగానే బాడీ డీహైడ్రేట్ అవుతుంది.వెయిట్ లాస్ లో ప్రోటీన్ కీలక పాత్రను పోషిస్తుంది.
కానీ అదే ప్రోటీన్ బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది.అతిగా ప్రోటీన్ తీసుకుంటే క్రమంగా శరీర బరువు అదుపు తప్పుతుంది.
ఇక ప్రోటీన్ మాత్రమే తీసుకోవడం పై దృష్టి పెడితే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫాట్స్ వంటి ఇతర పోషకాల్లో అసమతుల్యత ఏర్పడే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి.ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తారు.కాబట్టి శరీరానికి అవసరమైన ప్రోటీన్ మాత్రమే అందించండి.అలాగే ఇతర పోషకాలు తీసుకోవడంపై కూడా దృష్టి సారించండి.