హైదరాబాద్ నగర శివారులోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.వేలానికి పెడితే చాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
తాజాగా మోకిలలో భూములకు హెచ్ఎండీఏ వేలం ప్రక్రియను నిర్వహించిన సంగతి తెలిసిందే.
తొలి విడత వేలం ప్రక్రియలో భూములు అంచనాలకు మించి ధర పలికాయి.
ఇవాళ రెండో విడత వేలంలో భారీ ధర పలుకుతుంది.ఇందులో భాగంగా మొదటి రోజు నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో గజం అత్యధికంగా రూ.లక్ష పలికింది.దీంతో ప్రభుత్వానికి రూ.122 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.గజం కనిష్ట ధర రూ.63,513 పలికినట్లు పేర్కొన్నారు.
నిన్న ఒక్క రోజే 58 ప్లాట్లను హెచ్ఎండీఏ ఆన్ లైన్ లో విక్రయించగా ఇవాళ్టి నుంచి ఈనెల 29 వ తేదీ వరకు వేలం నిర్వహించనున్నారు.
రోజుకు 60 ప్లాట్ల చొప్పున ఐదు రోజుల్లో మొత్తం 300 ప్లాట్లను విక్రయానికి ఉంచింది.ఒక్కో గజానికి అప్ సెట్ రేటు రూ.25 వేలుగా ఉండగా మొత్తం ప్లాట్ల అమ్మకంతో సుమారు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.