రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ ఎన్నికల్లో గెలిచి దేశవ్యాప్తంగా బిఆర్ఎస్( BRS ) ప్రభావాన్ని చాటి చెప్పాలని, ఇక్కడ గెలిస్తేనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పరువు ప్రఖ్యాతలు దక్కుతాయని, లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేననే భయం కేసీఆర్ లో నెలకొంది.
అందుకే కాంగ్రెస్, బిజెపి లపై పై చేయి సాధించే విధంగా అనేక వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు బిజెపి, కాంగ్రెస్ వ్యవహారాలను పసిగడుతూ, పై చేయి సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేయించి పార్టీ పరిస్థితులను , గెలుపు అవకాశాలను అంచనా వేశారు.
ఈ మేరకు అభ్యర్థుల ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.మొదటి విడత లిస్టును వచ్చేనెల ఆగస్టులో ప్రకటించాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మొదటి విడత అభ్యర్థుల ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నారు.గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే అనేక సర్వే సంస్థల నివేదికలు, నిఘా సంస్థల రిపోర్టులు ఆధారంగా నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై కేసీఆర్ ఒక అంచనాకు వచ్చారు.దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికను చేపట్టారు.
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై( Sitting Mlas ) వ్యతిరేకత ఉంటే, మరొకరికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.ఇక మొదటి విడత కేసిఆర్ ప్రకటించబోయే అభ్యర్థుల లిస్ట్ పై బీఆర్ఎస్ తో పాటు, కాంగ్రెస్, బిజెపిలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తరువాత కాంగ్రెస్, బిజెపిలు కూడా తమ మొదటి విడత జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకున్నాయి.