కరోనా రక్కసి సృష్టించిన విలయతాండవం అంతాఇంతాకాదు, అది చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు.ఇక ఈ మహమ్మారి తీవ్రత దాదాపుగా తగ్గడంతో యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే కాస్త స్వేశ్చగా ఊపిరి పీల్చుకుంటోంది.
అయితే పెద్దన్న అమెరికాలో మాత్రం ఇపుడు సరికొత్త వైరస్ విజృంభిస్తోంది.ఈ వైరస్ ను హ్యూమన్ మెటా న్యుమో వైరస్ ( Human meta pneumovirus )(హెచ్ఎంపీవీ) అని పిలుస్తున్నారు నిపుణులు.
ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోందని భోగట్టా.

దీని విచిత్ర లక్షణం ఏమంటే, చాలా మందిలో ఈ వైరస్ ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తించడం కష్టమట.ఇంకో ప్రమాదకర విషయం, ఈ వైరస్ కు అసలు వ్యాక్సిన్ లేదు.COVID, RSV కేసులు తగ్గుతున్నప్పటికీ, HMPV అని పిలువబడే ఈ కొత్తరకం శ్వాసకోశ వైరస్ అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ మార్చి ప్రారంభంలో యుఎస్‌లో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎమ్‌పివి) కి సంబంధించి 20 శాతం యాంటిజెన్ పరీక్షలు దాదాపు 11 శాతం పిసిఆర్ పరీక్షలు( PCR tests ) పాజిటివ్‌గా వచ్చాయని తేలడంతో అగ్రగాజ్యం హడలిపోతోంది.

ఏప్రిల్‌లో ఈ కేసుల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, మేలో తగ్గడం కాస్త అక్కడ ఊరటనిచ్చే అంశం.కాగా CDC (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) గత వారం దేశవ్యాప్తంగా HMPV కేసుల పెరుగుదలను గుర్తించిందని గణాంకాలు చెబుతున్నాయి.ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతోందని భోగట్టా.
ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ చాలా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని అంటున్నారు.హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.