సబ్ సెంటర్ వారీగా గర్భవతుల నమోదుపై ఏఎన్ఎం లు ప్రత్యేక దృష్టి సారించాలని, కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం బోయినిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సబ్ సెంటర్ ల వారీగా సమీక్ష నిర్వహించారు.
సబ్ సెంటర్ వారీగా గర్భవతుల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత డెలివరీలు, క్షయ వ్యాధి బాధితుల గుర్తింపు, ఎన్క్వాస్ గుర్తింపు, తదితర అంశాలను ఏఎన్ఎం లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్క్వాస్ గుర్తింపుకు అవసరమైన ఫర్నిచర్ అందుబాటులోకి తీసుకువచ్చి, ఎన్క్వాస్ సర్టిఫికేట్ వచ్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఏఎన్ఎం లు గర్భవతుల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, సాధ్యమైనంత ఎక్కువగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలన్నారు.ప్రైవేట్ ఆస్పత్రులలో జరిగే ప్రసవాలలో చాలా మటుకు సిజేరియన్ లు జరుగుతున్నాయని, బాలింతలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉందన్నారు.
మొదటి కాన్పులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీలు అయ్యేలా గర్భిణులను వారి కుటుంబ సభ్యులకు ఏఎన్ఎం లు అవగాహన కల్పించాలని అన్నారు.లాబోరేటరీ, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, మెడికల్ స్టోర్ రూమ్, డిస్పెన్సరీ, వార్డులను పరిశీలించారు.
అందుబాటులో ఉన్న మెడిసిన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.గడువు దాటిన మందులు ఎప్పటికప్పుడు తీసివేయాలని ఫార్మాసిస్ట్ కు సూచించారు.
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స, మందులు అందించాలని ఆదేశించారు.ఈ సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంఎహెచ్ఓ డా.రజిత, కంటి వెలుగు ప్రోగ్రామ్ అధికారి డా.శ్రీరాములు, స్థానిక సర్పంచ్ గుంటి లతశ్రీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.రేణుక, డీడీఎం కార్తీక్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.