ఏపీ అంతటా పాదయాత్ర చేపట్టి తన ప్రభావాన్ని పెంచుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ డిసైడ్ అయిపోయారు.గతంలో ఎన్నికలకు ముందు పాదయాత్ర నిర్వహించిన వారంతా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, ఇప్పుడు అదే ఫార్ములాను తన విషయంలోనూ ఉపయోగించుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.
దీనికి తోడు గతంలో కంటే ఇప్పుడు తన గ్రాఫ్ పెరిగిందని , దీనిని మరింతగా పెంచుకోవాలని జగన్ కు ధీటుగా తాను తయారవ్వాలనే ఉద్దేశంతో జనవరి 27వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు.
దాదాపు 400 రోజుల పాటు ఈ పాదయాత్ర నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
గతంలో వైసిపి అధినేత హోదాలో జగన్ పాదయాత్ర చేపట్టారు.దాదాపు 3648 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర నిర్వహించారు.
ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యే విధంగా జగన్ చూసుకున్నారు.ఇప్పుడు తాను అదే విధంగా పాదయాత్ర చేపట్టి టిడిపిని 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ ఉన్నారు.
ఈ మేరకు పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్దమవుతుంది.అయితే ఇక్కడే జగన్ లోకేష్ పాదయాత్రకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైసిపి అధినేత హోదాలో జగన్ పాదయాత్ర సమయంలో ఎన్నో కీలక నిర్ణయాలను, హామీలను ప్రకటించారు.తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాము అనే విషయాన్ని చెప్పారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ఎన్నికలు మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి తన చిత్త శుద్దిని నిరూపించుకున్నారు.

అయితే జగన్ మాదిరిగా లోకేష్ ప్రజలకు అటువంటి హామీలు, పాదయాత్ర సమయంలో ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ప్రశ్నగా మారింది.ఎందుకంటే టిడిపి తరఫున ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, వాటిని అమలు చేస్తామని హామీ ఇవ్వాలన్నా, దానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి.జగన్ మాదిరిగా లోకేష్ తన నిర్ణయాలను బాహాటంగా ప్రకటించే ఛాన్స్ ఉండదు.
అలాగే ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతలు తన విషయంలో అసంతృప్తితో ఉండడంతో, వారు పాదయాత్ర సమయంలో లోకేష్ కు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానంగానే ఉంది.అలాగే గతంలో జగన్ చేపట్టిన పాదయాత్ర సమయంలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను పాదయాత్ర సమయంలోనే జగన్ ప్రకటించారు.
కానీ లోకేష్ అటువంటి ముందస్తు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రకటించే ఛాన్స్ , స్వతంత్రం ఉండవు.పాదయాత్ర సమయంలో ప్రజలకు పార్టీ నాయకులకు ఎన్నో హామీలను ఇవ్వాల్సి ఉంటుంది.
అటువంటి వాటిని లోకేష్ ఎంత వరకు ఇవ్వగలరు.? జగన్ మాదిరిగా ఎంతవరకు పాదయాత్రను సక్సెస్ చేయగలరు అనేది సొంత పార్టీ నాయకులకు అనుమానంగానే ఉంది.