ఉన్నత విద్య, వృత్తి, ఉద్యోగాల కోసం భారతీయులకు గమ్యస్థానంగా వున్న విదేశాల్లో కెనడా ఒకటి.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.
సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.కెనడాకు దగ్గరవుతున్నారు.
ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.ఇక అతి తక్కువ ఖర్చుకే నాణ్యమైన విద్య లభిస్తుండటం, మెరుగైన ఉపాధి అవకాశాల కారణంగా భారతీయులు కెనడాకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు.
అయితే స్టూడెంట్ వీసా మంజూరుకు నిరీక్షణ సమయం పెరుగుతుండటంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత్‌లోని కెనడా హైకమీషన్ స్పందించింది.
విద్యార్ధుల నిరాశను తాము అర్ధం చేసుకున్నామని, పరిస్ధితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది.ఈ మేరకు గురువారం వరుస ట్వీట్లు చేసింది.
ప్రతివారం వేలాది మంది భారతీయ విద్యార్ధులు కెనడా వీసా పొందుతున్నారని.ఈ క్రమంలో వేచి వుండే సమయాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని కెనడా హైకమీషన్ తెలిపింది.
వాస్తవానికి సెప్టెంబర్ 2022 ఇన్‌టేక్ కోసం స్టడీ పర్మిట్‌లతో పాటు ఏడాది పొడవునా దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నామని కమీషన్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా స్టడీ పర్మిట్ దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయం 12 వారాలని కెనడా హైకమీషన్ స్పష్టం చేసింది.2022లో భారతదేశంలో ప్రాసెసింగ్ సమయాలు ఎక్కువగా వున్నాయని అంగీకరించిన కమీషన్.ప్రపంచవ్యాప్తంగా తమ సేవలలో వేచి వుండే సమయాన్ని తగ్గించడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేసింది.
ఈ దశలో ఇప్పటికీ వీసా దరఖాస్తుల ఫలితం కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధులు తరగతులు ప్రారంభమయ్యే సమయానికి చేరుకోలేకపోతే .కెనడాలోని లెర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్‌ను సంప్రదించాలని కెనడా హైకమీషన్ సూచించింది.
.