కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు జాతీయ పార్టీలైనా వారి విధానాలు వేర్వేరుగా ఉంటాయి.ఈ రెండు పార్టీలు అనుసరించే వ్యూహాలు కూడా భిన్నంగానే ఉంటాయి.
అయితే ఓ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాన్నే కమలం పార్టీ అనుసరిస్తోంది.ముఖ్యమంత్రులను మార్చడంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద చరిత్రే ఉంది.
కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉన్న రోజుల్లో సీఎంలను దించేసి సీల్డ్ కవర్‌లలో నేతల పేర్లను పంపడంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పండిపోయింది.
అయితే కాంగ్రెస్ విధానాలను కలలో కూడా వ్యతిరేకించే బీజేపీ మాత్రం ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరినే ఫాలో అవుతూ ఉంది.
దేశంలో సీఎంలను మార్చేయడంలో కాంగ్రెస్ కన్నా బీజేపీ వేగంగా దూసుకెళ్తోంది.గతంలో ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలలో ఆఘమేఘాల మీద సీఎంలను మార్చిన కమలం పార్టీ ప్రస్తుతం త్రిపుర విషయంలో సీన్ రిపీట్ చేసింది.
ఉత్తరాఖండ్‌లో ముగ్గురు సీఎంలను మార్చినా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
దీంతో త్రిపురలోనూ ఇదే ఫార్ములాను బీజేపీ ఉపయోగిస్తోంది.
త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ చేత రాజీనామా చేయించి మరొకరిని సీఎం సీట్లో కూర్చోబెడుతోంది.త్రిపురలో గతంలో బీజేపీ అధికారంలోకి రావడంలో విప్లవ్ దేవ్ కీలక పాత్ర పోషించారు.
వచ్చే ఏడాది త్రిపురలో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో విప్లవ్ దేవ్‌పై ప్రజా వ్యతిరేకత ఉందని.
అందుకే బీజేపీ అధిష్టానం విప్లవ్ దేవ్ స్థానంలో మాణిక్ సాహాను సీఎంగా కూర్చోబెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి ఉత్తరాఖండ్ ఫార్ములా త్రిపురలో సక్సెస్ అవుతుందో లేదో వచ్చే ఎన్నికల్లో తేలిపోనుంది.అటు కర్ణాటకలోనూ యడ్యూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మైను రంగంలోకి దించింది.అయితే ఆయన కూడా తన పదవిని నిలబెట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ తన పదవికి గండం ఏర్పడకుండా చూసుకుంటున్నారు.ఏదేమైనా సీఎంలను మార్చేయడంలో బీజేపీ త్వరలోనే కాంగ్రెస్ రికార్డులను తుడిచివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
.