విదేశాలలో ఉండే ఎన్నారైలతో పెళ్లి చేస్తే తమ పిల్ల సుఖంగా ఉంటుందని, ఎంతో మంచి జీవితం ఉంటుందని ప్రతీ ఆడపిల్ల తల్లి తండ్రులు ఆశపడుతుంటారు.అందుకు తగ్గట్టుగా ఏరి కోరి, లక్షల కట్నాలు , బంగారం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేస్తారు.
తీరా అక్కడికి వెళ్ళిన తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఆంటే పరవాలేదు,కానీ ఒక వేళ మనస్పర్ధలు వస్తే వారి దైనందిక జీవితం ఎలా ఉంటుందో ఊహించలేం.ఎల్లలు దాటి ఎక్కడో ఉంటారు, బాధను పంచుకునే వారు ఉండరు, నచ్చజెప్పే వారు లేక మానసికంగా ఎంతో కుంగిపోతారు.
ఒక్కో సారి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే, మరో కొందరు హత్యలకు చేయడానికి కూడా వెనుకాడరు.ఇలాంటి సంఘటనే UK లో భారత సంతతి జంటకు ఎదురయ్యింది.
వివరాలలోకి వెళ్తే.
పంజాబ్ కు చెందిన కసిష్ కు అదే రాష్ట్రానికి చెందిన గీతిక అనే మహిళతో వివాహం అయ్యింది.
ఎన్నో ఆశలతో భర్తతో యూకే వచ్చిన ఆమె జీవితం కొంత కాలం బాగానే సాగింది.మధ్య మధ్యలో గొడవలు వస్తూ ఉన్నా ఇద్దరి మధ్య కొట్లాటలు ఉన్నా గీతిక సర్దుకు పోతూ ఉండేది.
అయితే రాను రాను ఈ గొడవలు ఎక్కువ అవడంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవడం మొదలయ్యాయి.ఈ క్రమంలోనే 2021 మార్చి 3 వ తేదీన ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగడంతో ఆమెపై తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త భార్య గీతికపై కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా శరీరంలో 19 సార్లు పొడిచాడు.
ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
దాంతో భార్య మృత దేహాన్ని కవర్ లో చుట్టేసి నిర్మానుష ప్రదేశంలోకి తీసుకువెళ్లి పాతి పెట్టాడు.
ఇంటికి వచ్చేసిన తరువాత ఏమీ తెలియని వాడిలా నటిస్తూ తన భార్య తప్పిపోయింది అంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు.కానీ పోలీసులు భర్తపై అనుమానంతో అక్కడి సిసి టీవి పుటేజ్ లో పరిశీలించి భర్తను నిందితుడిగా నిర్ధారించుకుని సాక్ష్యాదారాలతో సహా కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసుపై విచారణ చేపట్టిన UK కోర్టు అతి తక్కువ వ్యవధిలోనే నిందితుడుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.