కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది.ఇందులో విద్యా రంగం కూడా ఒకటి.
గడిచిన ఏడాదిన్నర కాలంగా పిల్లలు ఇంటిపట్టునే వుంటున్నారు.నాలుగు గోడల మధ్యనే ఆన్‌లైన్ క్లాసులతోనే విద్యాసంస్థలు నెట్టుకొస్తున్నాయి.
అయినా అంతా సాఫీగా సాగుతోందని కాదు.ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.
కార్పోరేట్ స్కూళ్లకు పంపలేని పేద కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపుతున్నాయి.తాము పస్తులుండి, రెక్కలు ముక్కలు చేసుకుని వారిని ఎలాగో చదివించుకుంటున్నారు.
ఈ పరిస్ధితుల్లో కరోనా రక్కసి వారి ఉపాధిని దూరం చేయడంతో పాటు మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.ఆన్‌లైన్ క్లాసులకు హాజరవ్వాలంటే ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ ఖచ్చితంగా వుండాల్సిందే.
వాటిని కొనిపెట్టేంత స్తోమత లేక పేదలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.వీరి కష్టాలను తెలుసుకున్న పలువురు దాతలు వారి కష్టాలను కొంతైనా తీర్చుతున్నారు.
అయితే కేవలం 15 ఏళ్ల వయసులోనే ఓ భారత సంతతి బాలుడు తన తోటి పిల్లలు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుండటం చూసి వారికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.అనుకున్నదే తడవుగా 100 లాప్‌టాప్‌లు కొని వారికి అందజేశాడు.
ఈ కృషికి గుర్తింపుగా అతనికి ప్రతిష్టాత్మక డయానా పురస్కారం వరించింది.
వివరాల్లోకి వెళితే.
యూకేలోని వెల్లింగ్టన్ కాలేజీలో చదువుకుంటున్న 15 ఏళ్ల విద్యార్ధి ఇషాన్ కపూర్ ఢిల్లీలోని శ్రీరామకృష్ణ ఆశ్రమం సాయంతో నిరుపేద విద్యార్ధులకు సాయం చేస్తున్నాడు.లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడుతున్న భారత్‌లోని పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు గాను ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టాడు.
అతని పిలుపుకు మంచి స్పందన వచ్చింది.ఫండ్ రైజింగ్‌లో దాదాపు 5000 యూరోలు (భారత కరెన్సీలో రూ.51,57,499) పోగయ్యాయి.వీటితో 100 లాప్‌టాప్‌లు కొనుగోలు చేసిన ఇషాన్ వాటిని ఢిల్లీకి పంపాడు.
ఇషాన్ కృషికి గుర్తింపుగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ డయానా జ్ఞాపకార్థం నెలకొల్పిన డయానా అవార్డుకు ఎంపికయ్యాడు.
కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు సైతం డయానా అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.SHOMA అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తనకు ఈ అవార్డు వచ్చినట్లు హిమాన్షు ట్విటర్‌లో చెప్పారు.
గ్రామాలను స్వయం సమృద్ధి సాధించే దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యం.తన నాయనమ్మ శోభా, అమ్మ శైలిమా ఇద్దరు పేర్లను కలిపి సోమా అని పెట్టాను హిమాన్షు చెప్పారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తనకు మార్గదర్శకుడిగా నిలిచిన తన తాతయ్య, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు హిమాన్షు.అలాగే గంగాపూర్-యూసుఫ్‌ఖాన్‌పల్లి వాసులకు, తన గురువులకు కూడా హిమాన్షు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు
.