అందరి అనుమానాలను నిజం చేస్తూ, ఎట్టకేలకు వైసీపీ బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లు కనిపిస్తోంది.గత కొంత కాలంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీతో సఖ్యతగా ఉండేందుకు ఏపీ సీఎం జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు.
కేంద్రం ప్రవేశపెడుతున్న కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో స్వయంగా ఎన్డీఏలోని మిత్రపక్షాలు, జగన్ కు నమ్మకమైన స్నేహితుడు కెసిఆర్ సైతం వ్యతిరేకిస్తున్న బిల్లుల విషయంలోనూ జగన్ సానుకూలంగా ఉండడమే కాకుండా, తమ ఎంపీలతో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.వాస్తవంగా కొద్ది రోజుల క్రితం ఏపీలో తలెత్తిన పరిణామాలు చూస్తే, కేంద్రం జగన్ తో కయ్యానికి కాలు దువ్వుతోందని, తెలుగుదేశం పార్టీలాగే వైసీపీ ని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తుందని ఇలా ఎన్నో అనుమానాలు అందరిలోనూ తలెత్తాయి.
దానికి తగ్గట్టుగానే రెండు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు పెరిగిపోతూ వచ్చాయి.
కానీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా, కేంద్రం మాత్రం వైసీపీ పై సానుకూల వైఖరి అవలంబిస్తూ, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వస్తుండడంతో, బీజేపీ వైసీపీ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.
స్వయంగా ప్రధాని మోదీ జగన్ కు పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వం అవసరం అసలు కేంద్రానికి ఎంత ఉందో తేలిపోయింది.ఎన్డీఏలోని ఒక్కో మిత్రపక్షం బయటికి వెళ్లిపోతున్న పరిస్థితుల్లో తమకు తిరుగులేకుండా చేసుకునేందుకు 2024 ఎన్నికల్లో మళ్ళీ గట్టెక్కేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా జగన్ ప్రభుత్వం మద్దతు కూడగట్టుకునే పనిలో భాగంగానే కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను జగన్ కలిసిన సందర్భంలో ఈ పొత్తు ప్రతిపాదన వచ్చింది.
అప్పుడే వైసీపీ ఎన్డీఏ లో చేరితే రెండు కేంద్ర క్యాబినెట్ పదవులతో పాటు, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టారని ప్రచారం జరిగింది.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తో జగన్ భేటీ అయ్యి ఎన్డీయేలో చేరే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఏపీ కి సంబంధించిన అనేక సమస్యలతో పాటు, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అభ్యంతరం లేకపోతేనే తాము ఎన్డీయేలో చేరతామనే కండిషన్ జగన్ పెట్టినట్లుగా వైసీపీలో కీలక నాయకులు వెల్లడిస్తున్నారు.ఇదంతా ఇలా ఉంటే, ఎన్డీఏలో వైసీపీ చేరితే, కలిగే ప్రయోజనాలు ఏంటంటే రెండు సహాయ మంత్రి పదవులతో పాటు, రాష్ట్రానికి అనేక అంశాలలో మేలు జరుగుతుంది.
టీడీపీ గత ఎన్డీయే లో మంత్రి పదవులు అనుభవించినా, ఏమీ చేయలేక పోయిందని, కానీ తాము చేరి అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పుకోవడానికి వైసీపీకి చక్కని అవకాశం దొరుకుతుంది.దీంతో పాటు కేంద్రం నుంచి నిధులను సంపాదించడంలో ఏపీ ప్రభుత్వం పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదు.
ఎలాగూ రెండు కేబినెట్ స్థాయి మంత్రి పదవులు ఉండడంతో, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు వైసీపీకి అవకాశం ఏర్పడుతుంది.దీంతో పాటు కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే, వైసీపీకి మద్దతు పెరగడంతోపాటు, వచ్చే ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ దక్కించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం చిక్కుతుంది.
ఇక కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఏపీకి అనేక కేటాయింపులు చేసుకోవడంతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులకు విముక్తి, రైల్వే పనులు ముందుకు కదిలే అవకాశం, రోడ్లు, విమానాశ్రయాలు పోర్ట్ లు ఇలా చెప్పుకుంటూ వెళితే, ఎన్నో అంశాల్లో కేంద్రం సహకారం దక్కుతుంది.మరీ ముఖ్యంగా చెప్పుకుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మరి కొంతమంది టిడిపి నాయకుల అవినీతి వ్యవహారాలను సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది.అదే జరిగితే వైసిపి ఏపీలో మరింత బలమైన పార్టీగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడటంతో పాటు, ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల విమర్శల నుంచి కాస్త ఉపశమనం లభించినట్లు అవుతుంది.
ఇక నష్టాలు విషయానికి వస్తే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సామాజిక వర్గాలకు దూరం అవడంతో పాటు వైసిపి, బీజేపీలను విమర్శించేందుకు కాచుకుని టీడీపీకి విమర్శలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
బీజేపీతో జత కట్టి పైచేయి సాధించేందుకు చూస్తున్న చంద్రబాబు ఇక పూర్తిగా, ఈ రెండు పార్టీలపైనా విమర్శలు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, అనేక అంశాల్లో వైసిపికి ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.అలాగే కేంద్రం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు అయినా వ్యవసాయ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణల బిల్లుల విషయంలో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నా, టీడీపీ ఆ అంశాలను మరింత హైలెట్ చేసి, జనాల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఇక వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ వైసీపీ పొత్తు కొనసాగితే, కొన్ని కీలకమైన స్థానాలను బీజేపీకి అప్పగించాల్సి వస్తుంది.
దీంతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేనకు ప్రాధాన్యం ఇస్తూ, ఆ పార్టీకి కొన్ని సీట్లను కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఆ సమయంలో రెండు పార్టీలతోనూ వైసీపీకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
దీంతో పాటు మైనారిటీ ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీకి దూరమవుతుంది.ఇప్పటి వరకు వైసీపీకి అండగా ఉంటూ వస్తున్నారు.
ఇప్పుడు నేరుగా బీజేపీతో పొత్తు అంటే వారంతా దూరమయ్యే అవకాశం లేకపోలేదు.ఈ విమర్శల నుంచి తట్టుకోవాలంటే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన అంశాలను జనాలు పట్టించుకోరు వైసీపీ కూడా తాము ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏలో చేరమని బలంగా జనాల్లో చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.