ఉవ్వెత్తున ఎగిసిపడిన అమరావతి ఉద్యమం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.ఈ విషయంలో పేటెంట్ తీసుకున్నట్టుగా పెద్దఎత్తున పోరాటం చేస్తూనే అమరావతి జేఏసీ తరఫున పోరాటం నడిపించిన టీడీపీ పూర్తిగా పక్కకు తప్పుకున్నట్టుగా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే అమరావతి వ్యవహారంలో కేంద్రం క్లారిటీ ఇవ్వడం, హైకోర్టులో సైతం అఫిడవిట్ దాఖలు చేసి ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని క్లారిటీగా చెప్పేయడం, అలాగే ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విశాఖ లోనే పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండటం, ఇక టిడిపి నాయకులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి ఉద్యమంలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, వంటి పరిణామాలతో చంద్రబాబు సైతం ఇప్పుడు ఈ విషయంలో సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం అమరావతి ఉద్యమం మొదలై 250 రోజులు అవుతోంది.
కానీ దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఏదీ చంద్రబాబు ప్రకటించకపోవడం చూస్తుంటే, ఈ విషయం అర్థమవుతుంది.గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న చంద్రబాబు, అమరావతి విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం, ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, పేదల ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతి, వరదలు వంటి విషయాలను ఎక్కువగా చంద్రబాబు హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లెక్కి పోరాటం చేసే పరిస్థితులు లేకపోవడం, తాను ఏపీకి వచ్చే అవకాశం కనిపించకపోవడం వంటి వాటితో ఇక ఎంతగా ఈ విషయాన్ని హైలెట్ చేసినా, ప్రయోజనం ఉండదనే ఈ విషయంలో బాబు మౌనంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు.ఈ విషయాన్ని తెగే వరకు లాగా కూడదు అనే అభిప్రాయంతో బాబు ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.అదీ కాకుండా, ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్నా, ఇప్పుడు అమరావతి విషయాన్ని హైలెట్ చేసేందుకు టిడిపి ప్రయత్నిస్తే , బీజేపీ గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతి వ్యవహారంలో నెలకొన్న అనేక అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చే ప్రమాదం ఉండటంతో బాబు ఈ విషయం పట్టించుకోనట్టుగా కనిపిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కేవలం టిడిపికి చెందిన కొంత మంది అమరావతి పరిసర ప్రాంత నాయకులు మాత్రమే ఈ వ్యవహారంపై కాస్త హడావుడి చేస్తున్నా, పార్టీ అధిష్టానం నుంచి ఈ విషయంలో ఏ నిర్ణయం వెలువడక పోవడం చూస్తుంటే, ఇక ముందు ముందు కూడా పూర్తిగా అమరావతి వ్యవహారాన్ని టిడిపి పక్కన పెట్టడం ఖాయమనే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.