ఎన్నికల సమయంలో సర్వేల సంస్థల హడావుడి మాములుగా ఉండదు.ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.? ప్రజలు ఏమనుకుంటున్నారు.? అధికారం ఎవరికి దక్కబోతోంది అనేవి లెక్కతేల్చుతుంటారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అనేక సర్వే సంస్థలు తమ ఫలితాలను ప్రకటించాయి.తాజాగా మరో సర్వే రిజల్ట్ బయటకి వచ్చింది.నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట తాజాగా మరోసారి సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ -సీఓటర్స్ వెల్లడించింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీ 25 ఎంపీ స్థానాల్లో ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చింది.టీడీపీ కేవలం 5 ఎంపీ స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలో తేలింది.ఓట్ల శాతంలోనూ టీడీపీ, వైసీపీ మధ్య భారీగా తేడా ఉంది.వైసీపీ ఓట్ల శాతం 41.2గా ఉండగా టీడీపీకి 31.2 శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది.కాంగ్రెస్, బీజేపీలకు ఏపీలో ఒక్క లోక్‌సభ స్థానం కూడా దక్కే అవకాశం లేదని వెల్లడించింది.
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కూటమి స్వల్పంగా పైచేయి సాధించిందని రిపబ్లిక్ టీవీ వివరించింది.తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే మహాకూటమికి ఎనిమిది స్థానాలు, టీఆర్‌ఎస్‌కు ఏడు ఎంపీ స్థానాలు దక్కుతాయి.ఎంఐఎంకు ఒకటి, బీజేపీకి ఒక స్థానం వస్తాయని వివరించింది.
కాకపోతే… డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు దీనికి భిన్నంగా ఉండవచ్చని రిపబ్లిక్ టీవీ అభిప్రాయపడింది.లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ 30.40% ఓట్లు , కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 32.2% , బీజేపీ 19% , ఏఐఎంఐఎం 3.9 శాతం ఓట్లు సాధిస్తాయని సర్వే వివరించింది.దేశం మొత్తం మీద చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 261 లోక్‌సభ స్థానాలు దక్కుతాయని.సాధారణ మెజారిటీ 272కు కొద్ది దూరంలో ఎన్‌డీఏ నిలిచిపోనుందని తెలిపింది.
2014 ఎన్నికల్లో 282 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 21 స్థానాలను కోల్పోతోంది.కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 119 స్థానాలను ఈసారి సాధించబోతోందని.అయితే ఎన్‌డీఏ, యూపీఏకు సమదూరం పాటిస్తున్న ఇతర ప్రాంతీయ పార్టీలదే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో హవా నడవనుంది.ఇతర ప్రాంతీయ పార్టీలు ఏకంగా 163 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నాయని సర్వేలో వెల్లడించింది.
అయితే ఈ సర్వే మొత్తం లోక్ సభకు సంబంధించి మాత్రమే చేశారు.