బ్రహ్మోత్సవం పోస్టుమార్టం

బ్రహ్మోత్సవం సినిమా చూస్తున్నంత సేపు రెండు ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి.ఒకటి … అసలు సినిమాలో ఏం జరుగుతోంది? రెండు … ఈ సినిమాని మహేష్ బాబు ఎలా ఒప్పుకున్నాడు.సూపర్ స్టార్లకి కూడా అర్థం పర్థం లేని కథ చెప్పి ఒప్పించవచ్చా, అయితే నా నోటికి ఏదొస్తే అది చెప్పేస్తా మహేష్ కి, అని ఒక సాధారణ ప్రేక్షకుడికి అలోచన వచ్చేలా ఉంది సినిమా.

 Brahmotsavam Post Mortem-TeluguStop.com

ఫ్రేమ్ లో 30-35 మంది ఉంటారు.

వాళ్ళలో ఎవరు ఎవరికి ఏం అవుతారో ప్రేక్షకులకి తెలీదు.షాయజీ షిండే ఉంటాడు, కాని ఏం చేస్తున్నాడో అర్థం కాదు.

కృష్ణభగవాన్ ఉంటాడు, కాని ఎప్పుడో ఓసారి మాట్లాడతాడు.మిగితా పాత్రలు ఎందుకున్నాయి, ఏం చేస్తున్నాయి అర్థం కాదు.“మీ ఇంట్లో వాళ్ళందరిని ఒక్కసారి పలకరిస్తే అలసిపోతాను, ఇక వీళ్ళతో జీవితాంతం ఎలా ఉండను” అంటూ ఓ సందర్భంలో హీరోతో అంటుంది కాజల్.ఈ సినిమా కూడా అంతే, అంతమంది విసిగిస్తూ ఉంటే సినిమా మొత్తం ఎలా కూర్చోవాలి ప్రేక్షకుడు? మాటిమాటికి వచ్చిపోయే పాటలు ప్రేక్షకుల ఓర్పుని ప్రశ్నిస్తే, మహేష్ తో వేయించిన డ్యాన్సులు శ్రీకాంత్ అడ్డాలకి పెద్ద హీరోని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదని నిరూపిస్తాయి.

కథ గురించి చర్చించుకోవాల్సిన పని లేదు.ఎందుకంటే ఇందులో కథ ఏముందో శ్రీకాంత్ అడ్డాల గారు తప్ప ఎవరు చెప్పలేరు.చుట్టాలంతా ఎప్పుడు కలిసే ఉంటారు, ఆడతారు, పాడతారు, టూర్ కి వెళతారు.ఎప్పుడూ మాట్లాడుకున్నా తెలుగులోనే మాట్లాడుతారు కాని ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు.

ఆ గుంపులో రావు రమేష్ ఒక్కడే తేడా.దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే, మహేష్ బాబు గుంపులో గొవిందం.

రావు రమేష్ మాత్రం మన మెదడులో రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్.ఇక్కడే బ్రహ్మోత్సవం ఓటమి మొదలైంది.

రావు రమేష్ కలిసిమెలసి ఉండటానికి ఇష్టపడడు సరే.అంతమాత్రానికే హీరో తండ్రి అయిన సత్యరాజ్ చనిపోయాడు సరే, ఆ తరువాత హీరో అమ్మ అయిన రేవతి స్పందన ఏంటి ? బంధాలు అనుబంధాల విలువ సంబరాల్లో కంటే, కష్టంలోనే కదా ఎక్కువ తెలిసేది.మరి రేవతి, మిగితా బంధువుల స్పందన ఎక్కడ? హీరో సోదరి విదేశాల్లో ఉంటుంది.తనని ఒక సన్నివేశం కోసం వాడుకున్నారు పెద్దగా అవసరం లేకపోయినా, నాన్న చనిపోయాక ఆ కూతురు ఎక్కడ? అన్ని పాత్రల్లో దర్శకుడే ఓ పాత్ర మరిచిపోతే, ఇక ప్రేక్షకుల తప్పేముంది.వారికి ఓపిక ఎక్కడినుంచి రావాలి?

సత్యరాజ్ చనిపోయిన సీన్లో మహేష్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు దర్శకుడు.గట్టిగా చెప్పాలంటే, ఆ ఒక్క సన్నివేశంలో మాత్రమే మనకు మహేష్ బాబు, మహేష్ బాబులా కనబడతాడు.

సినిమా మొత్తంలో బాగున్న ఒకే ఒక్క సన్నివేశం అది.స్టార్ గా, నటుడిగా మహేష్ వాల్యూ ఇదీ అని ప్రేక్షకుడు ఫీల్ అవుతుండగానే ఇంటర్వెల్ అయిపోతుంది.ఆ తరువాత సినిమా బాగుంటుందేమో అన్న అత్యాశ మొదలవుతుంది.

ఇక సెకండాఫ్.సమంత లాంటి క్యారెక్టర్ మనం నిజజీవితంలో దాదాపుగా చూడలేం.అంత నాటకీయత ఎందుకు ఆ పాత్రకు అనే విసుగు ఓవైపు, తెరపై మహేష్ బాబు లాంటి కథనాయకుడు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నాడు అనే ఏడుపు మరోవైపు , రెండూ మొదలవుతాయి.

సినిమాలో ఉన్న అసలు కథ, ఇప్పుడు మొదలువుతుంది.ఏడు తరాలు వెతుక్కోవడం.

ఆ అవసరం ఎందుకు వచ్చింది ? ఎమో, గట్టిగా అడిగితే ఎవరు చెప్పలేరు.

మహేష్, సమంత కలిసి నార్త్ ఇండియా మొత్తం తిరిగేస్తారు.

అదేదో మన తెలుగు రాష్ట్రాల్లోనే తిరిగేస్తే బాగుండేది.కనీసం ఇక్కడే ఏదో జరుగుతోంది అని అనుకునేవారు.

రోజంతా కాయకష్టం చేసుకోని తెరపై మహేష్ బాబు అలరిస్తే చూద్దామని వచ్చిన ప్రేక్షకుడు అప్పటికే సగం నిద్రలోకి జారుకుంటాడు.మహేష్ ఎవరిని కలుస్తున్నాడో, ఎందుకు కలుస్తున్నాడో, ఆ ప్రాంతాలేంటో, ఇవేవి బుర్రకు ఎక్కవు.

అహో ఓహో అని చెప్పుకున్న క్లయిమాక్స్ లో మహేష్ నార్త్ ఇండియాలో కలిసిన చుట్టాలంతా వచ్చేస్తారు.అక్కడ ఒక చిన్న ట్విస్ట్‌, తరువాత రావు రమేష్ మారిపోతాడు.

కథ సమాప్తం.అసలు మహేష్ రావురమేష్ ని మార్చాలనుకోని ఇదంతా చేసాడా అని ఇప్పుడు అర్థం అవుతుంది ప్రేక్షకుడికి.

దానర్థం, ఇంతసేపు సినిమా ఎందుకు చూస్తున్నామో ఎవరికి తెలియట్లేదు.

ఇంత చిన్న కథను చిన్నహీరోతో తీసినా కష్టమే.

అలాంటిది మహేష్ బాబుతో తీసాడు అడ్డాల.డైలాగులు ఒక్కటంటే ఒక్కటి గుర్తు పెట్టుకోడు ప్రేక్షకుడు, అంత అసహజంగా ఉంటాయి.

పాత్రలెంతసేపు ఫిలాసఫి మాట్లాడితే సినిమా ఎందుకు? ఏదో పుస్తకం చదువుకుంటే సరిపోద్ది కదా.

సంబరాలలో కలిసున్న కుటుంబం, ఒక మనిషి చనిపోతే మారిందా ? అలాగే కలిసుందా? అసలు కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చిందా ? కథానాయకుడికి పెద్ద సమస్య వచ్చి పడితే అతను తీర్చేసాడా? రావు రమేష్ పాత్ర తప్పితే మిగితా కుటుంబ సభ్యుల స్వభావం ఏంటి ? అదంతా అవసరం లేకపోతే, తెలిసున్న ఆర్టిస్టులతో చిన్న చిన్న పాత్రలు వేయించి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? మొత్తం మీద కథానాయకుడు సాధించిదేంటి? 1-నేనొక్కడినే సినిమాకి కూడా ఇంతలా బుర్ర బాదుకోవాల్సిన అవసరం రాలేదు.

క్లాస్ పేరుతో కథ లేకుండా సినిమా తీయాలి అనుకుంటే బ్రహ్మోత్సవంకి పట్టిన గతే పడుతుంది ప్రతి సినిమాకి.చివరగా చెప్పేదేంటంటే, ఏమి లేకున్నా సాగదిస్తున్న సిరియళ్ళు టీవిలో చాలా వస్తున్నాయి.

వాటి అవసరం వెండితెరకు లేదు.కథ ఎప్పుడూ కథనాయకుడి చేతిలో ఉండాలి.

ఎందుకంటే అతడు కథకి నాయకుడు.హాలివుడ్ అయినా టాలివుడ్ అయినా, ఇదే సూత్రం వర్తిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube