టమాటా పంట సాగు( Tomato Cultivation )లో అధిక దిగుబడులు సాధించాలంటే.నారు పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
ఎందుకంటే తెగులు నిరోధక ఆరోగ్యకరమైన నారును ఎంపిక చేసుకొని సాగు చేస్తేనే నాణ్యమైన అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.వాతావరణంలో ఉష్ణోగ్రత 21 నుంచి 24 మధ్యన ఉంటే పంట నాణ్యత బాగుంటుంది.
ఉష్ణోగ్రత 32 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే పంట దిగుబడి తక్కువగా ఉంటుంది.టమాటా ముక్కలు మంచు, తేమ పరిస్థితులను తట్టుకోలేవు.
టమాటా నారు పెంపకంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం.టమాటా నారు పెంచే నారుమడి మూడు లేదా నాలుగు మీటర్ల పొడవు, పది నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు, 0.7 నుంచి ఒక మీటరు వెడల్పు ఉండేలాగా మట్టితో సమానంగా బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి.ఇక బెడ్ల మధ్య దూరం కనీసం 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాలి.
ఒక ఎకరం పొలానికి 120 గ్రాముల విత్తనాలు అవసరం.విత్తనాలను నారుమడిలో చల్లే ముందు విత్తన శుద్ధి చేయాలి.ఒక కిలో విత్తనాలను రెండు గ్రాముల థైరం లేదంటే 4గ్రాముల ట్రైకోడెర్మా విరిడి తో విత్తన శుద్ధి( Seed treatment ) చేయాలి.విత్తనాలను రెండూ లేదా మూడు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి.
ఆ తర్వాత నారుమడి పై గడ్డి లేదంటే చెరుకు ఆకులతో కప్పాలి.టమాటా విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఆ వరిగడ్డిని పూర్తిగా తొలగించాలి.
మట్టిలో తేమను బట్టి నీరు అందించాలి.ముఖ్యంగా నారుమడిలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక టమాటా నారును ప్రధాన పొలంలో నాటడానికి ఒక వారం ముందు నుంచే నారుమడికి నీటి తడి అందించడం ఆపేయాలి.ఇలా చేయడం వల్ల మొక్క యొక్క కాడ గట్టి పడుతుంది.
ఇక టమాటా నారును ప్రధాన పొలంలో నాటడానికి ముందు పొలంలో నాలుగు రోజుల ముందు నీటిని పారించాలి.టమాటా నారును 15 మిల్లీలీటర్ల నువాక్రాన్, 25 గ్రాముల డిథెన్ M-45 ద్రావణంలో 10 లీటర్ల నీటిని కలిపి ఓ ఐదు నిమిషాల పాటు నారును ముంచి ఆ తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ఈ పద్ధతులను సక్రమంగా పాటించడం వల్ల మొక్కలకు చీడపీడల, తెగుళ్ల బెడద ( Pests )తక్కువగా ఉండడంతో పాటు నాణ్యమైన టమాటా పంట దిగుబడి పొందవచ్చు.