అగ్ర రాజ్యం అమెరికాకు గంట 25 నిమిషాల పాటు అధ్యక్షురాలిగా వ్యవహరించిన అమెరికా ఉపాధ్యక్షురాలు, మన భారత సంతతి మహిళ కమలా హారీస్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.అధ్యక్షురాలిగా కాసేపు ఉన్నా ఆమె ఎంతో హుందాగా నడుచుకున్నారని, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వైట్ హౌస్ పొగడ్తలతో ముంచెత్తుతోంది.
దాంతో కమలా రాజకీయ భవిష్యత్తుపై ఎన్నో చర్చలు మొదలయ్యాయి.
జో బిడెన్ వైద్య పరీక్షల నిమ్మిత్తం 1.30 గంటల పాటు అధ్యక్ష విధులకు దూరంగా ఉండగా బిడెన్ మళ్ళీ విధుల్లో చేరేవరకూ ఉపాధ్యక్షురాలైన కమలా హారీస్ అధ్యక్షురాలిగా నియమించబడిన విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఆమె కాలయాపన లేకుండా సమర్ధవంతంగా భాద్యతలు చేపట్టారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ ప్రకటించారు.
కమలా హారీస్ ఉపాధ్యక్షురాలిగా ఉంటూ అధ్యక్ష భాద్యతలు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఉన్నది కాసేపే అయినా ఆమె ఎంతో మందకి స్పూర్తిగా నిలిచారని ఆమె పేర్కొన్నారు, అంతేకాదు కమలా హారీస్ ను యువత స్పూర్తిగా తీసుకోవాలని కితాబిచ్చారు.
కాగా కమలా హారీస్ అధ్యక్ష భాద్యతలు చేపట్టిన మొదలు అమెరికా రాజకీయాల్లో ఎప్పటిలానే చర్చ మొదలయ్యింది.కమలా హారీస్ కాబోయే అధ్యక్షురాలని, బిడెన్ కు ఎలాగో వయసు అయ్యిపోయింది కాబట్టి ఇక కమలాకు పూర్తిగా భాద్యతలు అప్పగించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రిపబ్లికన్ పార్టీ గతంలో పలు మార్లు ఇదే తరహాలో బిడెన్ పై మండిపడింది, బిడెన్ విమానం మెట్లు ఎక్కలేక బిడెన్ చతికిల పడ్డారని, సరిగా చూడలేని బిడెన్ అధ్యక్ష బాధ్యతలలో ఇంకెంత కాలం నెట్టుకోస్తారని కమలా హారీస్ కాబోయే అధ్యక్షురాలంటూ ఫైర్ అయ్యింది.ఇదిలాఉంటే కమలా హారీస్ పై వైట్ హౌస్ ప్రశంసలు కురిపించడంపై భారతీయ ఎన్నారై సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.