ఇష్టమైన రంగంలో ఎదగాలని భావించే వారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాము అనుకున్నది సాధించి తీరుతారు.ఈ మాటను అక్షరాల రుజువు చేసి చూపించింది ఓ యువతి.
ప్రవాస భారతీయ సిక్కు కుటుంబానికి చెందిన అన్‌మోల్ నారంగ్ (23) అమెరికాలో చరిత్ర సృష్టించింది.వెస్ట్‌పాయింట్‌లోని ప్రఖ్యాత అమెరికా మిలటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి సిక్కు యువతిగా అన్‌మోల్ రికార్డుల్లోకి ఎక్కింది.యూఎస్ మిలటరీ అకాడమీకి 218 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది.
జార్జియాలోని రోస్‌వెల్‌లో పుట్టి పెరిగిన అన్‌మోల్ తాతయ్య భారత సైన్యంలో పనిచేశారు.ఆయన స్ఫూర్తితో తాను కూడా మిలటరీలో సేవలు అందించాలనుకున్న అన్‌మోల్… జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
అనంతరం హవాయిలోని హోనలూలులో ఉన్న పెరల్ హార్బర్ నేషనల్ మెమోరియల్ సందర్శించారు.ఈ సంఘటన అన్‌మోల్ జీవితాన్ని మలుపు తిప్పింది.అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అనంతరం సైన్యంలో చేరాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారు.

అనంతరం వెస్ట్‌పాయింట్‌లోని అమెరికా మిలటరీ అకాడమీలో చేరారు.నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె… శనివారం జరిగిన స్నాతకోత్సవంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో పట్టా అందుకున్నారు.అన్‌మోల్ ఇప్పటికే సైన్యంలో సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు.
తదుపరి ఆమె ఓక్లోహామాలోని లాటన్‌లో ఉన్న ఫోర్ట్‌సిల్ సైనిక కేంద్రంలో బేసిక్ ఆఫీసర్ లీడర్‌షిప్ కోర్సులో శిక్షణ తీసుకోనున్నారు.
దీనిపై అన్‌మోల్ మాట్లాడుతూ… అమెరికా మిలటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న తన కల తీరిందన్నారు.
ఈ విజయం సాధించడానికి జార్జియాలోని సిక్కు సమాజానికి చెందిన సభ్యులు తనకు మద్ధతుగా నిలిచారని అన్‌మోల్ తెలిపారు.ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా సిక్కు అమెరికన్లు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరని నిరూపించానని ఆమె ఉద్వేగానికి గురయ్యారు.
ఇష్టమైన రంగంలో ఎదగాలనే కోరిక బలంగా ఉంటే అసాధ్యం అనేది ఉండదని అన్‌మోల్ పేర్కొన్నారు.ఫోర్ట్‌సిల్‌లో శిక్షణ అనంతరం … ఆమెకు వచ్చే ఏడాది జనవరిలో జపాన్‌లోని ఒకినావాలో తొలి పోస్టింగ్ లభించే అవకాశం వుంది.