తల్లిదండ్రుల భౌతిక ఉనికిని, వారి పిల్లల సంరక్షణను టెక్నాలజీ అనేది ఎప్పుడూ భర్తీ చేయలేదు.టెక్నాలజీని నమ్మి వారిని కనిపెట్టొచ్చులే అని భావిస్తే ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదాలు జరగక మానవు.
పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి శ్రద్ధ, ప్రేమ రక్షణ అవసరం.వారిని ఒంటరిగా విడిచిపెట్టడం ఏమాత్రం మంచిది కాదు.
తల్లిదండ్రులుగా ఉండటం అనేది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన, సవాలుతో కూడిన బాధ్యతలలో ఒకటి.తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల అవసరాలు, భద్రతకు మొదటి స్థానం ఇవ్వాలి.
టెక్నాలజీలను వారి ప్రేమ, సంరక్షణకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు.అయితే తాజాగా ఒక తండ్రి తన ఐదేళ్ల కుమార్తె సంరక్షణను అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు అప్పచెప్పి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పబ్‌కి వెళ్లాడు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్‌లోని పోవిస్ అనే పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
అతడు పబ్‌కి వెళ్లిన సమయంలో తన ఐదేళ్ల కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది.కుమార్తెను ఒక కంట కనిపెట్టడానికి అతడు తన ఫోన్‌లోని అలెక్సా కెమెరాను ఉపయోగించాడు.అయితే తెల్లవారుజామున 2 గంటల సమయంలో తోట నుంచి అరుపులు వినిపించగా ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు.
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.అప్పుడు వారికి ఆ వ్యక్తి, తన లవర్‌తో గొడవ పడడం కనిపించింది.
పోలీసులు వారిద్దరిని వేరుచేసి శాంతింప చేశారు.ఆ తర్వాత ఆ వ్యక్తి తన ప్రియురాలి గొంతు నులిపినట్లు ఒప్పుకున్నాడు.
అలాగే తన కూతురిని ఒంటరిగా ఇంటిలో వదిలిపెట్టినట్లు పోలీసులకు తెలిసింది.అది కూడా అలెక్సాకి అప్పజెప్పి వచ్చాడని వారు తెలుసుకున్నారు.తర్వాత కోర్టులో అతడిని హాజరు పరిచారు.ఆ వ్యక్తి తన కుమార్తెను బాగా చూసుకుంటున్నాడని కోర్టు స్థానికుల ద్వారా తెలుసుకుంది.అయితే, అతను పబ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆమెను సరిగ్గా చూసుకోలేదని కోర్టు గ్రహించింది.అలానే ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా గొంతు పిసకడాన్ని, పిల్లల నిర్లక్ష్యపు నేరాన్ని అంగీకరించాడు.
దాంతో కోర్టు అతనికి అతనికి 12 నెలల శిక్ష విధించింది.అయితే ఆ శిక్ష రెండు సంవత్సరాల పాటు సస్పెండ్ చేయబడింది, అంటే 12 నెలల సమయంలో అతను ఆదేశాల మేరకు అధికారుల పరిశీలనలో షరతులకు కట్టుబడి ఉన్నంత కాలం అతను జైలు శిక్షను అనుభవించడు.
ఒకవేళ ఈ కాలంలో అతడు షరతులను అతిక్రమిస్తే జైలు శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది.