తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డగించిన ఘటన టీడీపీ గ్రాఫ్‌ను పెంచిందా? రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉదాసీనంగా ఉన్న పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చిందా. నాయకులను సంఘటితం చేసిందా? ఈ ఘటనతో టీడీపీ బలం ఏమిటో అధికార పార్టీకి తెలిసిపోయిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.తాజాగా జరిగిన ఘటనలో చంద్రబాబు వ్యవహరించిన తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా స్వాగతించారు.కొందరు విమర్శించినా ఎక్కువ మంది చంద్రబాబు సంయమనంతో వ్యవహరించారన ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా బాగున్నాయని అంటున్నారు.
ఇక, పార్టీ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు నాలుగు దశలు ముగిశాయి.అయితే అనుకున్న విధంగా నాయకులు ముందుకు కదలలేదు.
పైగా చంద్రబాబు చెప్పినట్టు టార్గెట్‌ను కూడా రీచ్ అవలేదు.చాలా పంచాయతీల్లో టీడీపీకి బలం ఉన్నా క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు ఉన్నా కూడా నాయకులు ఉదాసీనంగా వ్యవహరించడంతో వైసీపీ వాటిని ఏకగ్రీవం చేసుకుంది.
ముఖ్యంగా పలమనేరు, పీలేరు వంటి నియోజకవర్గాల్లోనూ టీడీపీ సత్తా చాటలేక పోయింది.దీనికి కేవలం నాయకులు ముందుకు రాకపోవడమేనని స్పష్టంగా తెలిసింది.

ఈ నేపథ్యంంలో ఇప్పుడు జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపించడం కష్టమనే భావన వ్యక్తమైంది.నేతల మద్య ఆధిపత్య పోరు అసంతృప్తి వంటివి తగ్గలేదని నివేదికలు కూడా అందాయి.అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఘటన ఉద్దేశ పూర్వకంగా జరగకపోయిన యాదృచ్ఛికంగా జరిగినా నాయకులు మాత్రం ముందుకు కదిలారు.నాయకులు గృహనిర్బంధాలను సైతం ఎదుర్కొన్నారు.
కొందరిని పోలీసులు అరెస్టులు చేశారు.ఇక, జిల్లాల్లోనూ టీడీపీ అదినేత చంద్రబాబుకు అనుకూలంగా నాయకులు రంగంలోకి దిగి ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు.
దీంతో టీడీపీ మళ్లీ పుంజుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నాయకులను కూడా ఈ ఘటన సంఘటితం చేసిందని పార్టీ బలపడడం ఖాయమని.
అంటున్నారు.నిజానికి ఇప్పటి వరకు పార్టీలో చంద్రబాబు నాయకత్వాన్ని కొందరు వద్దంటున్నారంటూ ప్రచారం సాగింది.
ఆయన తర్వాత ఎవరైనా వస్తే బాగుంటుందని పేర్కొన్నారు.అయితే తాజా ఘటనతో ఈ విమర్శలు నినాదాలు కొట్టుకుపోయాయని అంటున్నారు పరిశీలకులు.
మొత్తానికి చంద్రబాబుకు జరగరాని అవమానం జరిగినా అది కూడా అనుకూలంగా మారిందనే వాదన వినిపిస్తోంది.