రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా యువత అంతా తనను ఐకాన్ గా చూస్తూ ఉండడం, తాను ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా యూత్ నుంచి విశేష స్పందన వస్తుండడం వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో యూత్ ను ఆకట్టుకోవడం ద్వారా, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చనే ప్లాన్ తో పవన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత అందర్నీ ఏకతాటిపై తీసుకువచ్చి వారందరిని జనసేనకు అనుకూలంగా మార్చడంతో పాటు, వారి ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేయాలనే ప్లాన్ తో పవన్ ఉన్నారు.
దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈనెల 12వ తేదీన ఈ యువశక్తి భారీ బహిరంగ సభను జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సభకు యువతీ యువకులంతా ఆహ్వానితులేనని, యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్తు గురించి చెప్పుకునేందుకు యువశక్తి కార్యక్రమం దోహదపడుతుందని, ఈ కార్యక్రమంలో యువత తమ అభిప్రాయాలను సంకోచం లేకుండా వినిపించవచ్చని పవన్ పిలుపునిచ్చారు.కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు చేపడుతూ, యువత మద్దతు జనసేనకు మరింత పెరిగేలా చేసుకోవాలనే వ్యూహంలో పవన్ ఉన్నారు.

2019 ఎన్నికల్లో యూత్ ఓట్ల పైనే పవన్ ఆశలు పెట్టుకున్నా… చాలావరకు వైసీపీ వైపు మొగ్గు చూపించడంతో జనసేన ఫరాజయం పొందింది.ఆ తరహా ఫలితాలు మళ్లీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో పవన్ పక్కాగా యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.అలాగే తన సినీ అభిమానులను కూడా జనసేనకు మద్దతుదారులుగా మార్చే ప్రయత్నాలు పవన్ మొదలుపెట్టారు.ఇప్పుడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఏర్పాటు చేస్తున్న ‘యువశక్తి ‘ కార్యక్రమం ద్వారా మరింత గా జన బలాన్ని పెంచుకునే ప్లాన్ లో పవన్ ఉన్నారు.