గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.
వీరిలో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీలు వరించాయి.అయితే దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను మాత్రం ఎవరికీ ప్రకటించలేదు.
ఇద్దరు ప్రవాస భారతీయులకు ఈసారి పద్మ అవార్డులు దక్కాయి.అమెరికాలో స్థిరపడిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస వరదన్‌ను పద్మ విభూషణ్ వరించింది.
అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో చేసిన అద్భుతమైన సేవలకు గాను కెనడాకు చెందిన సుజాత రామ్‌దొరై పద్మశ్రీకి ఎంపికైయ్యారు.
జనవరి 2, 1940న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన శ్రీనివాస వరదన్ గణితంలోని ‘‘probability theory’’పై ఎన్నో ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
గణిత శాస్త్రంలో చేసిన సేవలకు గాను నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ 2007 సంవత్సరానికి గాను ‘‘అబెల్ ప్రైజ్’’ని అందజేసింది.మద్రాస్ యూనివర్సిటీ నుంచి 1960లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస వరదన్ అనంతరం 1963లో కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డాక్టరేట్ పొందారు .
అదే ఏడాది భారత్ నుంచి న్యూయార్క్‌లోని కొరెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా వచ్చారు.ఫ్రాంక్ జే గౌల్ట్ కౌరెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌లో ఆయన గణిత శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు.అలాగే వరదన్‌కు బిర్‌కాఫ్ ప్రైజ్ (1994), న్యూయార్క్ యూనివర్శిటీ (1995) ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి మార్గరెట్ అండ్ హెర్మన్ సోకోల్ అవార్డు లెరోయ్ స్టీల్ ప్రైజ్ (1996) లభించాయి.2008లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఇకపోతే.సుజాత రామ్‌దొరై విషయానికి వస్తే .కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియాలో పనిచేస్తున్నారు.బీజగణిత సంఖ్య శాస్త్రంలో విశేష ప్రతిభకు గాను ఆమెకు 2006లో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ రామానుజన్ ప్రైజ్ దక్కింది.
ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు సుజాతే.తర్వాత 2004లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ కూడా ఆమెను వరించింది.2020 క్రీగర్-నెల్సన్ బహుమతిని కూడా అందుకున్నారు.
2007-2009 వరకు నేషనల్ నాలెడ్జ్ కమీషన్‌లో పనిచేసిన సుజాత రామ్‌దొరై ప్రస్తుతం భారత ప్రధానికి సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.దీనితో పాటు నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌లోనూ సభ్యురాలిగా వుంటున్నారు.1982లో బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసిన ఆమె.1985లో అన్నామలై వర్సిటీ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు.అనంతరం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి పీహెచ్‌డీ చేశారు.