రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీర్ఎస్ ను మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశం ఏర్పడుతుందని , లేకపోతే ఇబ్బందికర పరిస్తితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయము కేసిఆర్ లో ఉంది.
అందుకే రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు వివిధ సర్వేల ద్వారా, వాస్తవ పరిస్థితులను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.
దీనిలో భాగంగానే పార్టీలోని సీనియర్ నాయకులకు మళ్ళీ టిక్కెట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుండగా , పార్టీ సీనియర్ నేతలు మాత్రం ఈసారి ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసులను రంగంలోకి దింపి, తాము విరామం తీసుకోవాలని చూస్తున్నారు.ఈ మేరకు పార్టీ అధినేత కేసిఆర్ పైన ఒత్తిడి చేస్తున్నారట.అయితే ఈసారి ఎన్నికల్లో ప్రయోగాలు చేసేందుకు కేసిఆర్ ఏ మాత్రం ఇష్టపడడం లేదు.
వారసులకు టికెట్లు ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలో వారు అనుకున్న స్థాయిలో పట్టు సాధించలేరని, సీనియర్ నాయకులను రంగంలోకి దించితే వారికున్న రాజకీయ అనుభవం నియోజకవర్గ ఓటర్ల తో పరిచయాలు ఇవన్నీ కలిసి వస్తాయని , ఈ సమయంలో ప్రయోగాలకు వెళ్లడం అంత సరికాదనే ఉద్దేశంతో వారసుల ఎంట్రీకి కేసీఆర్ ఇష్టపడడం లేదట.అయితే తమ వారసులను రంగంలోకి దించేందుకు సీనియర్ నాయకులు చాలామంది తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారట.
పోచారం శ్రీనివాసరెడ్డి , మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి , ఇలా చాలా మంది పార్టీ సీనియర్ నాయకులు కెసిఆర్ పై ఒత్తిడి చేస్తున్నారట.
మంత్రి సబితా రెడ్డి తన కుమారుడు కార్తీక్ రెడ్డిని మరోసారి పోటీకి దించాలని చూస్తున్నారు.2014లోనే చేవెళ్ల ఎంపీగా కార్తీక్ రెడ్డిని పోటీకి దింపినా..
ఆయన ఓటమి చెందారు.దీంతో ఈసారి రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సబితా భావిస్తూ కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నారు అలాగే మంత్రి మల్లారెడ్డి తన ఇద్దరు కుమారులు భద్ర రెడ్డి, మహేందర్ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో పోటీకి దించాలని చూస్తున్నారు.
అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన కొడుకు ప్రశాంత్ రెడ్డి ని పోటీకి దించే ఆలోచనతో తన కుమారుడితో ఇ ప్పటికే నియోజకవర్గమంతా పాదయాత్ర చేస్తున్నారు.మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్ రావు ను మెదక్ అసెంబ్లీ నుంచి పోటీకి దించాలని చూస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది సీనియర్ నాయకులు తమ వారసులను రాబోయే ఎన్నికల్లో పోటీకి దించి తాము వెనకుండి వారిని నడిపించాలని చూస్తుండగా.కేసీఆర్ మాత్రం ఈ విషయంలో అంత సానుకూలంగా లేరట.