ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు అలవాటే.ఏదో రకంగా మూడోసారి టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు.
దీనిలో భాగంగానే 2023 ఎన్నికలపై ఆయన పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ బీజేపీలు తమకు దరిదాపుల్లోకి రాకుండా అఖండ మెజారిటీతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు రచిస్తున్నారు.దీనిలో భాగంగానే వివిధ సర్వే సంస్థలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేయించారట.
అయితే ఎక్కడ ఈ విషయం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలియకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నలభై సీట్లు మాత్రమే టిఆర్ఎస్ ఖాతాలో పడతాయని, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ, ఎంఐఎం పార్టీలకు అవకాశం ఉన్నట్లు తేలిందట.
దీంతో పెద్దఎత్తున ఇతర పార్టీల్లోని బలమైన నాయకులందరినీ టిఆర్ఎస్ లో చేర్చుకోవాలనే వ్యూహాన్ని కెసిఆర్ అమలు చేయబోతున్నారట.అలాగే ఈ బడ్జెట్ లోనే భారీ ప్రజాకర్షక పధకాలను ప్రకటిస్తూ, ప్రజల్లోకి మరింత గా టిఆర్ఎస్ ను తీసుకు వెళ్లాలని ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
అయితే కేసీఆర్ 2023 సార్వత్రిక ఎన్నికల వరకు ఆగుతారా లేక ముందస్తు ఎన్నికలకు వెళతారా అనే విషయంలో ఇప్పటివరకు ఏ క్లారిటీ రాలేదు.కేవలం నలభై సీట్ల వరకు మాత్రమే టిఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉందన్న నివేదికలతో కెసిఆర్ అప్రమత్తమయ్యారట.
దీనిలో భాగంగానే జిల్లా కమిటీలను కేసీఆర్ ప్రకటించారు రాష్ట్ర కమిటీలను త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.ఈ సర్వే నివేదికల ప్రకారం పెద్ద ఎత్తున సిట్టింగ్ లకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది.అలాగే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను గుర్తించడంతో పాటు వారు టిఆర్ఎస్ లోకి వచ్చేందుకు ఏం చేయాలనే విషయంపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం.ముఖ్యంగా టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో సానుకూలత లేదనే విషయం సర్వే రిపోర్టుల ద్వారా బయటపడడంతో, ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుని పార్టీని ఒడ్డెక్కించాలి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.