ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని సింగపూర్ గడ్డ మీదకు వెళ్తున్న కార్మికులు అక్కడ అనుకోని ప్రమాదాల బారినపడి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.ఈ ఏడాది విధి నిర్వహణలో వుండగానే పలువురు భారతీయులు మృతి చెందారు.
తాజాగా ఒక ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఏడాది పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఇది 46వది.
వివరాల్లోకి వెళితే.శుక్రవారం ఉదయం 21 తువాస్ అవెన్యూ 3వ సైట్‌లో వున్న ఆసియా టెక్నికల్ గ్యాస్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.
ఫ్యాక్టరీ ఆవరణలోని సిలిండర్‌ల నుంచి ఎసిటిలీన్ లేపే వాయువు లీక్ అవ్వడం వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు సింగపూర్ మానవశక్తి మంత్రిత్వ శాఖ (ఎంఓఎం) ఒక ప్రకటనలో తెలిపింది.అయితే ఈ దుర్ఘటనలో మరణించిన భారతీయుడు ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 43 ఏళ్ల చైనా జాతీయుడిని సింగపూర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం నేపథ్యంలో మండే గ్యాస్ సిలిండర్‌ల తనిఖీ, నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆసియా టెక్నికల్ గ్యాస్ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
మండే స్వభావం వున్న గ్యాస్ సిలిండర్‌లతో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఇకపోతే.గత నెలలో విధి నిర్వహణలో వుండగానే ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. నవంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మెర్లిమావు రోడ్‌లోని సింగపూర్ రిఫైనింగ్ కంపెనీలో బాధితుడు విధుల్లో వుండగా ఈ ఘటన జరిగిందని ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.
వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించి అతని మృతదేహాన్ని వెలికి తీశారు. 41 ఏళ్ల మృతుడు గతంలో ప్లాంట్ జనరల్ సర్వీసెస్‌లో పనిచేశాడు.
ఎంవోఎం (మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్) ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.రిఫనరీల్లో పరంజా (scaffolding operations) పనులను నిలిపివేయాలని బాధితుడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు న్యూస్ ఏషియా తెలిపింది.
సముద్రాలు, భారీ నీటి వనరుల సమీపంలో పనిచేసే కార్మికుల భద్రతపై యాజమాన్యాలు దృష్టి సారించాలని ఎంవోఎం కోరింది.అయితే సింగపూర్‌లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు.
ఈ ఏడాది జూన్‌లో నిర్మాణ స్థలంలో క్రేన్ మధ్యలో నలిగిపోవడంతో 32 ఏళ్ల భారతీయ కార్మికుడు మరణించిన సంగతి తెలిసిందే.