కర్ణాటక మాజీ మంత్రి,మైనింగ్ కింగ్ గా పేరు పొందిన గాలి జనార్దన్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.దేశంలోని కర్ణాటక లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలువురు మంత్రులు ,కర్ణాటక సీఎం ఇంకా పలువురు ప్రజా ప్రతినిధులు సైతం వరుసగా కరోనా బారిన పడుతూనే ఉన్నారు.దాదాపు అందరూ కూడా ఈ మహమ్మారిని జయించి బయటపడ్డారు.
అయితే ఇప్పడు తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఓబుళాపురం మైనింగ్ స్కాం లో అరెస్ట్ అయిన గాలి 2015 నుంచి షరతులతో కూడిన బెయిల్ పై బయటే ఉంటున్నారు.
అయితే కేసు దర్యాప్తులో ఉన్నందున ఆయన కోర్టు అనుమతి లేకుండా బళ్లారిలో పర్యటించకూడదు అంటూ సుప్రీంకోర్టు షరతు విధించింది.దీనితో ఆదివారం బళ్లారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు నుంచి రెండు రోజుల పాటు అనుమతి తీసుకున్న ఆయన కరోనా సోకడం తో అక్కడకు వెళ్లలేకపోతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో కోవిడ్ కావచ్చన్న అనుమానంతో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు.

దీనితో ఆయన కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది.దీంతో వైద్యుల సూచనల మేరకు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.తనకు కరోనా లక్షణాలు ఏమాత్రం లేవని వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు.
తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న తన మిత్రులు, అభిమానులకు గాలి జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.