ఈ నెల ప్రారంభంలో చోటు చేసుకున్న అత్యంత శక్తివంతమైన భూకంపం ధాటికి టర్కీ, సిరియాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇరుదేశాల్లోనూ మరణాల సంఖ్య 50 వేలు దాటిపోయింది.
ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం వుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఇక ఈ భూకంపం ధాటికి లెక్కకు మిక్కిలి మంది తీవ్రంగా గాయపడగా.
లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు, వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.దీంతో టర్కీ, సిరియాలు అంతర్జాతీయ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇప్పటికే భారత్ ‘‘ఆపరేషన్ దోస్త్’’ పేరిట ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి చెందిన వైద్య సిబ్బందిని, ఆహార పదార్థాలు, ఔషధాలను హుటాహుటిన పంపింది.మన సహాయక బృందాలు చేసిన సేవలకు అక్కడి ప్రజలు కన్నీటితోనే కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
భారత్‌తో పాటు పలుదేశాలు, స్వచ్ఛంద సంస్థలు టర్కీ, సిరియాలకు మానవతా దృక్పథంతో సాయాన్ని అందిస్తున్నాయి.
తాజాగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రవాస భారతీయ స్వచ్ఛంద సంస్థ సేవా ఇంటర్నేషనల్ కూడా స్పందించింది.టర్కీ , సిరియాలలోని భూకంప బాధితుల కోసం 200 బాక్స్‌లకు పైగా సహాయ సామాగ్రిని పంపింది సేవా ఇంటర్నేషనల్ హ్యూస్టన్ అమెరికార్ప్స్.హ్యూస్టన్ నగరానికి చెందిన పలు కమ్యూనిటీల ప్రజలు భూకంప బాధితుల కోసం ఇచ్చిన వస్తువులను , సామాగ్రిని సేవా ఇంటర్నేషనల్ ప్రత్యేక విమానంలో టర్కీ, సిరియాలకు పంపింది.
అలాగే బాధితుల కోసం ఈ సంస్థ సైతం ఫేస్‌బుక్ పేజీ ద్వారా నిధుల సేకరణను ప్రారంభించింది.ఇప్పటి వరకు 15000 డాలర్లను సేకరించినట్లు సంస్థ తెలిపింది.దీనితో పాటు సేవా ఇంటర్నేషనల్ భాగస్వామి ఫుడ్ ఫర్ లైఫ్‌కు చెందిన వాలంటీర్లు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రారంభించారు.హతే ప్రావిన్స్ రాజధాని అంటాక్యా సమీపంలోని గ్రామాలలో ప్రతిరోజూ సుమారు 1200 మందికి భోజనాన్ని అందిస్తున్నారు.