హర్యానా లో దారుణ ఘటన చోటుచేసుకుంది.పట్టపగలు కాంగ్రెస్ నేతను ఎవరో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు.
గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.హర్యానా కు చెందిన కాంగ్రెస్ నేత వికాస్ చౌదరి గురువారం ఫరీదా బాడ్ లో జిమ్ సెంటర్ నుంచి బయటకు వచ్చి కారులో ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.
దీనితో ఆయనను హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది.దుండగులు ఆయన పై దాదాపు 8-10 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
వికాస్ చౌదరి హత్యపై హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ తన్వార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోందని, చట్టాల పట్ల ఎవరికీ భయం లేకుండా పోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిన్నటికి నిన్న లైంగిక వేధింపులకు ప్రతిఘటించిన ఓ మహిళను కత్తితో పొడిచారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఈ విధంగా పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక రాజకీయ నేత పై దుండగులు కాల్పులు జరపడం ఘోరం అని అన్నారు.
వికాస్ చౌదరి హత్యపై తక్షణం విచారణ జరిపించాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.